రాజస్థాన్‌ రాయల్స్‌పై కింగ్స్‌పంజాబ్‌ విజయం…

Kings XI Punjab team
Kings XI Punjab team

జైపూర్‌: ఐపిఎల్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ జట్టులో క్రిస్‌ గేల్‌ (47బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సర్లతో 79), సర్పరాజ్‌ ఖాన్‌ (29బంతుల్లో 6ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 నాటౌట్‌)లు రాణించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ జట్టులో బట్లర్‌ (43బంతుల్లో 10ఫోర్లు, రెండు సిక్సర్లతో 69), శాంసన్‌ (25బంతుల్లో ఒక సిక్సర్‌తో 30), అజింకా రహానె (20బంతుల్లో 4 ఫోర్లతో 27), స్మిత్‌ (16బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌తో 20) చేయడంతో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.రాజస్థాన్‌ చివరి నాలుగు ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 21 పరుగులు అవసరం కాగా 6 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్‌పై 14 పరుగుల తేడాతో పంజాబ్‌ విజయం సాధించింది.
పంజాబ్‌ బ్యాటింగ్‌ సాగిందిలా…..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ పంజాబ్‌ ఆదిలోనే కెఎల్‌ రాహుల్‌ (4) వికెట్‌ను చేజార్చుకుంది.ధవల్‌ కులకర్ణి వేసిన తొలి ఓవర్‌ నాలుగో బంతికి కెఎల్‌రాహుల్‌ (4) కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరుణంలో మయాంక్‌ అగర్వాల్‌-గేల్‌ జోడీ సమయోచితంగా బ్యాటింగ్‌ చేసింది. వీరిద్దరూ 56 పరుగులు జోడించిన తర్వాత మయాంక్‌ (22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. స్పిన్నర్‌ గౌతమ్‌ బౌఇంగ్‌ భారీ షాట్‌కు యత్నించిన మయాంక్‌ అగర్వాల్‌ బౌండరీ లైన్‌ వద్ద కులకర్ణికి క్యాచ్‌ ఇచ్చాడు. ఆపై సర్పరాజ్‌ ఖాన్‌తో ఇన్నింగ్స్‌ను గేల్‌ ముందుకు తీసుకెళ్లాడు. ప్రధానంగా ఉనాద్కత్‌ వేసిన 12 ఓవర్‌లో మూడో ఫోర్లు, ఒక సిక్సర్‌ కొట్టాడు. ఆ ఓవర్‌లో 19 పరుగుల్ని గేల్‌ సాధించాడు. ఈ క్రమంలోనే అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే అర్థశతకం తర్వాత గేల్‌ జోరు పెంచాడు. బెన్‌ స్టోక్‌ వేసిన 16ఓవర్‌లో గేల్‌ 18 పరుగులు సాధించడంతో కింగ్స్‌ పంజాబ్‌ స్కోరులో వేగం పెరిగింది. కాగా, అదే ఓవర్‌ ఆఖరి బంతికి భారీ షాట్‌కు యత్నించిన గేల్‌…బౌండరీ లైన్‌ వద్ద రాహుల్‌ త్రిపాఠీ క్యాచ్‌ పట్టడంతో గేల్‌ (84) పెవిలియన్‌ చేరాడు.చివరి ఓవర్‌లో పంజాబ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. స్టోక్స్‌ బౌలింగ్‌లో పూరన్‌ (12) రహానెకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆపై సర్పరాజ్‌ ఖాన్‌ సమయోచితంగా ఆడటంతో కింగ్స్‌ పంజాబ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
ఐపిఎల్‌లో గేల్‌ మరో ఘనత…
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)లో విధ్వంసకర కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ మరో ఘనత సాధించాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగువేల పరుగులు సాధించిన రెండో విదేశీ ఆటగాడిగా రికార్డు సాధించాడు. గతంలో డేవిడ్‌ వార్నర్‌ ఈ ఘనతను అందుకున్నాడు. అంతేకాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో నాలుగు వేల పరుగులు అందుకున్న ఆటగాడిగా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. క్రిస్‌ గేల్‌ 112 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఇక ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌ (114), విరాట్‌ కోహ్లీ (128), సురేశ్‌ రైనా, గంభీర్‌ (140)లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.
రాజస్థాన్‌ బ్యాటింగ్‌ సాగిందిలా…
186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ జట్టులో ఓపెనర్లు దూకుడుగా ఆడారు. 8ఓవర్ల వరకు వికెట్‌ పడకుండా ఆడారు. ఈ క్రమంలో బట్లర్‌ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 9వ ఓవర్‌లో రహానె (27)ను అశ్విన్‌ క్లీన్‌బౌల్డ్‌గా ఔట్‌ చేశాడు. 12 ఓవర్‌ ముగిశాక మైదానంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బంతి వేయడానికి సిద్ధమైన అశ్విన్‌…ఒక్కసారిగా వెనక్కి తిరిగి బౌలింగ్‌ ఎండ్‌ వైపున్న వికెట్లను గిరాటేశాడు. ఈలోగా క్రీజులోకి బట్లర్‌రాలేకపోయాడు. పంజాబ్‌ ఫీల్డర్ల అప్పీల్‌ను పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ బట్లర్‌ (67)ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో రాజస్థాన్‌ 13 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు నష్టపోయి 110 పరుగులు చేసింది. ఆతర్వాత స్మిత్‌, శాంసన్‌ సమయోచితంగా ఆడారు. ఈక్రమంలో 17వ ఓవర్‌లో కరన్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేసి స్మిత్‌ (19), శాంసన్‌ (30)లను ఔట్‌ చేశాడు. 17ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఆతర్వాత 18 ఓవర్‌లో స్టోక్స్‌ (6), త్రిపాఠి (1) ఔటయ్యారు. 19వ ఓవర్‌లో పరుగు తీసే క్రమలో అర్చర్‌(2) రనౌటయ్యాడు. చివరి ఓవర్‌లో 21 పరుగులు చేయాల్సి ఉండగా…ఉన్కదత్‌ (1), కృష్ణప్ప గౌతమ్‌ (3) వెంటవెంటనే ఔట్‌ అయ్యారు. చివరి ఓవర్‌లో రాజస్ణాన్‌ కేవలం 6 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌ బౌలర్లలో కర్రన్‌ 2, రహ్మాన్‌ 2, రాజ్‌పూత్‌ 2, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశారు.
మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయండి