రష్యాతో దోస్తీకి ‘కిమ్‌’ తహతహ!

phutin, kim
phutin, kim

అమెరికా విధించిన ఆంక్షలను తొలగింపచేసుకునేందుకు ఆదేశంతో సయోధ్యకోసం యత్నించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ ఇపుడు తనకు సానుకూలంగా ఉన్న దేశాలతో సయోధ్యకు మరింతగా కృషిచేస్తున్నారు. 35 ఏళ్ల కిమ్‌ ఇపుడు తాజాగా రష్యాతో ఉన్న పాత దోస్తీని పునరుద్ధరించుకుంటున్నారు. రష్యాలోని ఇందుకు తూర్పు తీరంలో సుదూరంగా ఉన్న వ్లాదివోస్టాక్‌ ఓడరేవును చర్చల వేదికగా ఎంచుకున్నారు. బహుశా ఈనెల చివరివారంలోనే ఉండవచ్చని రష్యా అధ్యక్షభవనం అధికారులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కిమ్‌జాంగ్‌ ఉన్‌తో సమావేశం పట్ల పోర్టుసిటీగాపేరొందిన వ్లాదివోస్టోక్‌ స్థానికులు కూడా ఎంతో ఆతృతతో ఉన్నారు. అణ్వాయుధ సంపత్తితో తనకు తానే సాటి అని అమెరికాకు సైతం కంటిమీద కునుకులేకుండాచేసిన కిమ్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌పుతిన్‌ చర్చలు జరుపుతున్నారన్న వార్తలు అక్కడి వాసులకు ఎంతో ఉత్కంఠను కలిగిస్తున్నాయి.

అమెరికాతోమూడో విడతసైతం చర్చలుజరిపేందుకు తాము సిద్ధమేనని అయితే ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసి, ఉత్తరదక్షిణకొరియాల తీరంలో ఉన్న అమెరికా సేనలను ఉపసంహరింపచేస్తేనే ఒప్పందాలకు సిద్ధమన్న కిమ్‌జాంగ్‌ తాజాగా రష్యాతో దోస్తీ దేనికి సంకేతం అని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. అమెరికా రష్యాలమధ్య వైరం ఉప్పునిప్పులాంటిదన్న సంగతి తెలిసిందే. రష్యాపై విధించిన ఆంక్షలకు ఎంతమాత్రం వెరవని రష్యా తనదైనశైలితో ఇతర దేశాలను కలుపుకునిపోతున్నది. కొన్ని దేశాలకు అవసరమైతే దౌత్యపరంగా ఇతర దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సాయం చేస్తోంది. ఒకసారి సింగపూర్‌, మరోసారి తైవాన్‌ రాజధాని థైపేయిల్లో చర్చలుజరిగిన తర్వాత చర్చల్లో ఆశించినంత పురోగతి కనిపించకపోవడం తిరిగి అవసరమైతే అణుపరీక్షలునిర్వహిస్తామన్న కిమ్‌జాంగ్‌ ప్రకటనలు కొంత కలవరం కలిగించేవిగా ఉన్నా కిమ్‌ కొత్తగారష్యాతో చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపించడం పట్ల సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

రష్యాతో ఉత్తరకొరియాకు ఉన్న అతికొద్దిదూరం సరిహద్దుకు 130 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ ఓడరేవునగరాన్నే ఎంచుకోవడం భద్రతా కారణాలరీత్యానేనని తెలుస్తోంది. కిమ్‌ జాంగ్‌ తండ్రి కిమ్‌జాంగ్‌ ఇల్‌ కొత్తగా ఎన్నికైన పుతిన్‌ను 2002లోనే గతంలో వ్లాదివోస్టోక్‌లో కలుసుకని చర్చలుజరిపారు. ఇపుడు కిమ్‌ కూడా తన తండ్రి బాటనే కొనసాగిస్తున్నారు. రష్యా ఉత్తరకొరియా అధిపతులమధ్య చిట్టచివరిసమావేశం 2011లో జరిగింది. కిమ్‌ తండ్రి సైబీరియాకు ప్రత్యేక సాయుధ రైలులో ప్రయాణించిన సందర్భంగానే ఈ సదస్సు జరిగింది. అంతేకాకుండా సైబీరియాలో కిమ్‌ తండ్రి మైకాల్‌ సరస్సులో బోట్‌షికారుకూడా చేసారు. ఆ పర్యటనలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అప్పటి రష్యా అధ్యక్షుడు డిమిత్రీ మెద్వెదేవ్‌తో చర్చలుజరిపారు. అప్పటినుంచి మళ్లీ చర్చలే జరగలేదు. రెండోప్రపంచ యుద్ధం 70వ వార్షికోత్సవ సంబరాలను మాస్కోలో నిర్వహించిన సందర్భంలో కూడా 2015లో ఆ ఉత్సవాలకు కిమ్‌జాంగ్‌ హాజరుకాలేదు.

చివరినిమిషంలోనే ఆయన పర్యటన రద్దయింది. ఇపుడు తాజాగా కిమ్‌ స్వయంగా తాను రష్యా అధ్యక్షునితో చర్చలుజరపాలని భావిస్తుండటంతో ఇందుకోసం ఆయనకు సానుకూలంగా ఉన్న పోర్టుసిటీనే యుద్ధప్రాతిపదికన సిద్ధంచేస్తున్నారు. గతంలో కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తానున కూడా కిమ్‌తో చర్చలుజరిపేందుకు సిద్ధమేనని, మాస్కోలోజరిగిన కోల్డ్‌వార్‌లో మిత్రదేశంగా నిలిచిన ఉత్తరకొరియాతో అణుసంపత్తిపరంగా చర్చలుజరిపేందుకు తాముకూడా సిద్ధమైనని పుతిన్‌ ప్రకటించారు. అమెరికాతో ఎదురవుతున్న ఆంక్షలు, వాణిజ్యదౌత్యపరమైన అంశాల్లో రెండుదేశాలమధ్య నెలకొన్న వైరం, అంతర్జాతీయంగా కూడా కొన్ని అగ్రరాజ్యాలుగాభావిస్తున్న దేశాలు రష్యాపై వైరం ప్రకటించడం వంటివాటిని అధిగమిస్తూ వస్తున్న పుతిన్‌ ఇపుడు ఉత్తరకొరియా అధ్యక్షునితో జరిపే చర్చలు కూడా వ్యూహాత్మకమేనని భావించాల్సి వస్తోంది. రష్యా తనవరకూ అటు చైనా, ఇటు బ్రిక్స్‌ దేశాలతోపాటు తనకు సానుకూలంగా ఉన్న అన్ని దేశాలతోను సంబంధాలు దౌత్యబంధాలు, ఎగుమతిదిగుమతుల వాణిజ్యం కొనసాగిస్తోంది.

ప్రత్యేకించి రష్యా రక్షణరంగపరంగా అత్యధికంగా ఎగుమతులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు అణుసంపత్తిపరంగాచూస్తే ఉత్తరకొరియావద్ద అణునిల్వలు భారీస్థాయిలో ఉన్నందువల్లనే అణుపరీక్షలు యధేఛ్ఛగా నిర్వహిస్తోంది. గురిచూసి అమెరికాలోని దుర్భేద్యమైన నగరాన్ని సైతం లక్ష్యంగాచేసుకుని అణుక్షిపణులు ప్రయోగించే సామర్ధ్యం ఉన్నందువల్లనే ట్రంప్‌ సైతం ఉత్తరకొరియాతో చర్చలకు ఉపక్రమించారు. కిమ్‌తో రష్యా చర్చలుజరిపిన పక్షంలో ఇకముందు భవిష్యత్తులో ఉత్తరకొరియా అణుపరీక్షలు జరిపితే వ్లాదివోస్టోక్‌ ఉత్తర కొరియా అగ్ని కీలల్లోనికి చేరుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటివరకూ సముద్రతీరం వెంబడి ఉన్న ఈ నగర వాసులు భద్రత పరంగా ఎలాంటి ముప్పులేకుండా స్వేఛ్ఛగా జీవిస్తున్నారని, అదే కిమ్‌తో జరిపే చర్చలు దరిమిలా పరిణామాలపై కొంత ఆందోళనకరమేనన్న భావన కొందరిలోవ్యక్తం అవుతున్నది. అమెరికాతో జరిపిన రెండుదఫా చర్చలు విఫలం కావడంతో ఉత్తరకొరియా తాము ఇక అణుపరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిననేపథ్యంలో ఇపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపే చర్చలు అత్యంత కీలకం అవుతున్నాయి. చర్చల వివరాలను భద్రతాకారణాలరీత్యా అత్యంత గోప్యంగానే ఉంచిన ఇరుదేశాలు ఇపుడు కిమ్‌తోజరిపే చర్చలపై ఇప్పటికే అజెండాను రూపొందించినట్లు తెలుస్తోంది. అమెరికా తర్వాత కిమ్‌జాంగ్‌రష్యాతో జరిపే చర్చలపట్ల ఇపుడుప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహంలేదు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/