కాశ్మీర్‌ కల్లోలం ఇంకా ఎన్నాళ్లు?

      కాశ్మీర్‌ కల్లోలం ఇంకా ఎన్నాళ్లు?

kashmir crisis
kashmir crisis

భారత దేశానికి మకుటాయమానంగా ఉన్న జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రంలో జరుగుతున్న మారణ హోమం ఇంకా ఎన్నాళ్లు అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా జాతి యావత్తు ముందు నిలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం లేదా సైన్యం ఈ సమస్యపై చిరకాలంగా అంతం లేని పోరాటం సాగిస్తున్నప్పటికీ పరిష్కారం కనుచూపుమేరలో కనిపించడం లేదు. దేశ రక్షణకు ప్రాణాలు అర్పించే జవాన్లకు రక్షణ లేని పరిస్థితి అన్నట్లుగా కేవలం ఒక్క ముష్కరుని ఆత్మాహుతి దాడిలో 40 మంది అసువులు బాసిన ఈ ఘోర సంఘటనతో యావత్తు దేశ జనాభా ఉలిక్కిపడింది. శత్రువుతో పోరాడుతూ నేలకొరిగితే పరిస్థితి వేరు కానీ యంత్రాంగంలోని అలసత్వం లేదా నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ మారణకాండతో ఉన్నత స్థాయిలో మరింత లోతుగా సమీక్షించుకోవాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ ప్రకటించినట్లుగా ఇంటలిజెన్స్‌ వైఫల్యం లేకపోయినా తనఖీలు లేకపోవడం వల్లనే ఉగ్రవాది పెద్దయెత్తున ప్రేలుడు సామాగ్రితో సైనికులు వెళ్తున్న కాన్వాయిలోని వాహనాన్ని ఢీకొనే అవకాశం లభించింది. గవర్నర్‌ వివరించినట్లుగా ఉగ్రవాదులున్న పెద్ద వాహనం లోపలికి అనుమతి లభించడంలో ఎక్కడో నిర్లక్ష్యం ఉందని సత్యపాల్‌ మాలిక్‌ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల చర్యలకు భారత్‌ దీటుగా బదులిస్తుండటంతో వారు అసహనానికి గురైఈ దాడికి పూనుకున్నారనేది ఆయన వివరణ. అయితే దాడి జరిగే అవకాశం ఉన్నట్లుగా ముందే సమాచారం ఉందని కూడా గవర్నర్‌ వెల్లడించారు.
గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌ అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్‌ ప్రస్తుతం గవర్నర్‌ పాలనలో ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర వ్యవహారాలపై పూర్తి స్థాయిలో పరిపాలన సాగిస్తున్నందున ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు మరింత దృఢంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయి. ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఉగ్రవాదుల సమీకరణ తక్కువగా జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పైగా కాశ్మీర్‌లో రాళ్లదాడులు కూడా ఆగిపోయాయి. కానీ ఒక్కసారిగా ఉగ్రవాదులు పథకం ప్రకారం వ్యూహాత్మకంగా జరిపిన దాడిలో భారీ ప్రాణ నష్టం జరగడంతో భారత జాతి రక్తం ఉడికిపోయింది. ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నది. భారత ప్రభుత్వం ముందడుగువేసి ఉగ్రదాడిని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు దీటైన బదులివ్వాలని జాతి కోరుతున్నది. చైనా దేశ మినహా ఇతర దేశాలన్నీ ఈ దాడిని ఖండించడంతోపాటు భారత్‌ పట్ల సానుకూలంగా స్పందించాయి. దేశంలోని అన్ని పార్టీలు కూడా కేంద్రప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సపోర్టు చేస్తున్నాయి.ఈ పరిస్థితిలో కేంద్రం కూడా అన్నిప క్షాలతో సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్రంలో భారతీయజనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రప్రథమంగా అన్ని పక్షాలతో మీటింగ్‌ జరగడం ఈ సంఘటన తీవ్రతను గురించినట్లు అయింది. పుల్యామా ఉగ్రవాద దాడికి గట్టి బుద్ది చెబుతామని కూడా ప్రధాని నరేంద్రమోడి ప్రకటించి, దేశ ప్రజలకు ఊరట కల్పించారు..దేశ వ్యాప్తంగా పాక్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు సాగాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమతమ రాష్ట్రాలకు చెందిన అమరులైన జవాన్ల కుటుంబాలకు భారీగానే ఎక్స్‌గ్రేసియాను ప్రకటించి వీర జవాన్ల పట్ల గౌరవం చాటుకున్నాయి. అమర వీరులైన జవాన్ల అంత్యక్రియల్లో పాలుపంచుకోవాలని కూడా ప్రధాని స్వయంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.
తనిఖీలు జరిగి ఉంటే..
భద్రతాపరంగా లోటుపాట్ల వల్ల కూడా ఈ సంఘటన జరిగి ఉంటుందనే ప్రచారం కూడా ప్రారంభమైంది. రోడ్డు వెంట 78 వాహనాల ద్వారా సుమారు 2,500 మంది సైనికులు వస్తున్న సందర్భంగా మరిన్నిముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేదికాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ వాహనాలకు ప్రారంభానికి ముందే ఆ రూట్‌లో సమగ్ర తనిఖీలు చేసి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది. జామర్లు, పెట్రోలింగ్‌ వాహనాలను ఉపయోగించి ఉగ్రవాద కదలికలను పసిగట్టే విధంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నా, ఈ మేరకు ఆలోచనలు జరగలేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక విఐపి లేదా సెలబ్రిటీ వెళ్తున్న సమయంలో తీసుకునే కనీస జాగ్రత్త చర్యలు కూడా ఇంత పెద్దయెత్తున జవాన్లు ప్రయాణిస్తున్న సమయంలో పట్టించుకోకపోవడం చర్చకు తావిస్తున్నది. ప్రభుత్వంలో పదవుల్లో ఉన్న వారు, లేదా ఇతరత్రా కీలక వ్యక్తుల విషయంలో పాలనాయంత్రాంగం అనేక బందోబస్తు చర్యలు తీసుకుంటున్నది. ఇదే తరహాలో ఎక్కువ మంది సైనికుల రవాణా సమయంలోనూ అప్రమత్తంగా ఉంటే ఉగ్రవాదుల చర్యలను కొంతవరకైనా నిరోధించే అవకాశాలుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఉగ్రవాద సంస్థ జై షే మహమ్మద్‌ స్వయంగా ఈ సంఘటను తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ సంస్థ వెనుక పాకిస్థాన్‌ గూడచారి సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయం ఉన్నట్లుగా అమెరికాకు చెందిన ఇంటలిజెన్స్‌ విభాగం కూడా ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపించే చర్యలకు పాకిస్థాన్‌ పాల్పడుతున్నదని దీంతో రుజువు అయిందని చైనా దేశం మినహా ఇతర దేశాలు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాతోపాటు బ్రిటన్‌లు పాక్‌ను కట్టడి చేసే చర్యలు అవసరమని భావిస్తున్నాయి.ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని మట్టుబెట్టాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై కూడా అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరగే అవకాశాలున్నాయి. అయితే చైనా వంటి దేశాలు పాక్‌ పట్ల కొంత మొతక వైఖరి అవలంభిస్తుండటంతో ఉగ్రవాద కార్యకలాపకు పాక్‌ నుంచి ప్రోత్సహం లభిస్తూ, భారత్‌లో శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం కలుగుతున్నది.