సుప్రీంలో ‘కర్ణాటకీయం’పై దాఖలైన మరో పిటిషన్‌

supreem court
supreem court

న్యూఢిల్లీ: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం క్షణక్షణం రంగులు మారుతుంది. మరోవైపు కర్నాటకీయంపై సర్వోన్నత న్యాయస్థానంలో మరో పిటిషన్‌ దాఖలైంది. ఎమ్మెల్యే పదవిని త్యజించడం అంటే పార్టీ ఫిరాయించినట్లేనని, దీనిపై కోర్టు జోక్యం చేసుకోవాలని 400 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు సుప్రీంను ఆశ్రయించారు. కాంగ్రెస్‌ కార్యకర్తల తరఫున కర్ణాటక యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌ చాకో జోసఫ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్వీకరించింది. ఐతే రెబల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై నేడు విచారణ జరగనుందని, ఆ సమయంలో పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తి కూడా ఉంటే మీ అభ్యర్థనను విచారిస్తామని, ధర్మాసనం పేర్కొంది.

మరోవైపు శుక్రవారం నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాలతో సంకీర్ణ ప్రభుత్వానికి బలం తగ్గిందని, అలాంటి సమయంలో సభను నడపడం చట్ట విరుద్ధమని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే నేడు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ వేణుగోపాల్‌తో భేటి అయ్యారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/