బోయింగ్‌ విమానాలను తక్షణమే నిలిపివేయాలి

Boeing 737 MAX
Boeing 737 MAX


న్యూఢిల్లీ: బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలను బుధవారం సాయంత్రం కల్లా విమానాశ్రయాలకు పరిమితం చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కొనసాగింపుగా తాజాగా సేవల్ని నిలిపివేయాల్సిన సమయాన్ని కూడా (అంటే బుధవారం సాయంత్రం 4 గంటలు)ప్రకటించింది. అదే సమయానికి అత్యవసర సమావేశం కూడా నిర్వహించనున్నట్లు సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇటీవల జరిగిన ఇథియోపియాలో జరిగిన విమనా ప్రమాదంతో ప్రపంచంలోని పలు దేశాలు ఈ రకం విమానాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకానికి చెందిన విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో వాటి భద్రతా ప్రమాణాలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనదేశంలో స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ రకం విమానాలను కలిగి ఉన్నాయి. భద్రత దృష్ట్యా ఈ రకమైన విమానాల సేవలను రద్దుచేస్తున్నట్లు ఇప్పటికే స్పైస్‌జెట్‌ ప్రకటించింది. ప్రయాణికులను ఇతర విమానాల ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నిర్ణయంతో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను రద్దు చేశారు.