టిఆర్‌ఎస్‌లోనూ టెన్షన్‌!

trs
trs

ఓవైపు అక్కడక్కడ అసంతృప్తుల నిరసనలు..!
మరోవైపు ఇంకా ఖరారు కాని కోదాడ, ముషీరాబాద్‌, నాంపల్లి అభ్యర్థులపై ఉత్కంఠత!!
హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌లో టెన్షన్‌..టెన్షన్‌ వాతావారణం నెలకొంది. ఓవైపు ఇప్పటి వరకు ప్రకటించిన 116 అభ్యర్థులకు అక్కడక్కడ అసంతృప్తివాదుల నుంచి వ్యతిరేక ఎదరువుతోంది. తాజాగా ప్రకటించిన 10 స్థానాల్లో ఖైరతాబాద్‌ స్థానం నుంచి సీటు ఆశించిన మన్నె గోవర్థన్‌ అసంతృప్తితో రగలిపోతున్నారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు స్వయంగా వారి ఇంటికెళ్లి టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థి సీనియర్‌ నేత దానం నాగేందర్‌ కలిశారు. తన గెలుపుకు సహకరించాల్సింది మన్నె దంపతులను ఆయన కోరారు. అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌ స్థానం నుంచి టికెట్‌ ఆశించిన తెలంగాణ ఆమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కూడా తనకు సీటు దక్కక పోవడంతో ఆవేదనతో ఉన్నారు. ఇలా మరికొన్ని నియ్జోకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని సద్దుమణిగించేందకు మంత్రి కేటిఆర్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నాంపల్లి, ముషీరాబాద్‌ నియోజకవర్గాల్లోనూ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై మూడురోజులు పూర్తి కావస్తున్న గులాబీ పార్టీ నుంచి ఈ రెండు స్థానాల్లో బరిలోకి దిగేదెవరో అనే దానిపై స్పష్టత లేకపోవడడంతో ఆశావాహులు, వారి అనుచరులు తీవ్రఅందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియకు ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మంచి ముహుర్తాలు కూడా తక్కువగానే ఉండటంతో ఏం చేయాలో తెలియక వారు సతమతమవుతోన్నారు. చివరి క్షణంలో టికెట్‌ ఖరారు చేస్తే ప్రచారానికి తగినంత సమయం కూడా ఉండే పరిస్థితి లేదని పలువురు ఆశావాహులు వాపోతున్నారు. అధిష్టానం నిర్ణయాలు తీసుకోవడంతో జాప్యం చేస్తుండటంతో ఆశాహహులకు కంటిమీద కునుకు ఉండటం లేదు.
టిఆర్‌ఎస్‌లో టెన్షన్‌…టెన్షన్‌..!
టిఆర్‌ఎస్‌ పార్టీలో గతనెల 6వ తేదీన ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆపార్టీ అధినేత కేసిఆర్‌ సంచలనం సృష్టించారు. ఇందులో ప్రధానంగా తాజా మాజీ ఎమ్మేల్యే నల్లాల ఓదేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గాన్ని అనూహ్యంగా పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌కు కేటాయించడంతో ఒక్కసారి అసమ్మతి భగ్గుమంది. ఓదేలు అనుచరుడు ఒకరు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒక్కసారి అప్రమత్తమైన టిఆర్‌ఎస్‌ అగ్ర నాయతక్వం ఓదేలును పిలిచి చర్చలు జరిపి శాంతింప చేసింది. ఆ తర్వాత కూడా అక్కడక్కడ బయటపడ్డ అసమ్మతిని కూడా అదేరీతిలో చక్కదిద్దారు. పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ, ఇతర కార్పొరేషన్‌ ఛైర్మన్‌లాంటి నామినేటెడ్‌ పదవులు ఇస్తామని వారిని బుజ్జగించారు. తాజాగా ప్రకటించిన 10 మంది టికెట్లలో కొంత అశావాహులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎంపీలు ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ఆశించారు. అందులో మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌లకు అవకాశం దక్కింది. మరికొందరు ఆశించిన టికెట్‌ రాకపోవడంతో అసంతృప్తితో ఉండి..కాంగ్రెస్‌లోకి వెళుతున్నారనే ప్రచారం సాగింది.
ఇదిలా ఉండగా ఇంకా పెండింగ్‌లో ఉన్న రెండు అసెంబీ ్ల స్థానాల్లో కోదాడ, ముషీరాబాద్‌ టికెట్లు ఉన్నాయి. ఇందులో కోదాడ నుంచి సీనియర్‌ నాయకుడు చందర్‌రావు, మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత పోటీ పడుతున్నారు. వీరిద్దలో ఒకరికి సీట్లు కేటాయిస్తారంటున్నారు. ఇక నగరంలోని ముషీరాబాద్‌ సీటుపై కూడా సందిగ్థత నెలకొంది. ఈ టికెట్‌ను హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఎప్పటి నుంచో ఆశిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదేవిదంగా మరో సీనియర్‌ నేత ముఠా గోపాల్‌ కూడా ఈసీటును ఆశిస్తున్నారు. వీరుకాక మరికొందరు ఆశావాహులు కూడా ఈ టికెట్లను ఆశిస్తూ తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు.
ఇకపోతే నగరంలోని నాంపల్లి నియోజకవర్గ టికెట్‌ను తొలి జాబితాలో మునుకుంట్ల ఆనంద్‌కుమార్‌గౌడ్‌ పేరును ప్రకటించిన..ఇంతవరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. మరోవైపు ఇదే స్థానం నుండి సిహెచ్‌. అనంద్‌కుమార్‌గౌడ్‌ కూడా ఆశిస్తుండటంతో ఈ ఇద్దరిలో ఎవరి పేరును ఖరారు చేస్తారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.