దేశంలోని ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డు..మోడి

యువతుల పెళ్లి వయసుపై త్వరలో నిర్ణయం..ప్రధాని

pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..మహిళల కనీస వివాహ వయస్సు నిర్ధారణ అంశంలో కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని పునః పరిశీలించేందుకు ఓ ప్రత్యేక కమిటీ నియమించినట్లు పేర్కొన్నారు. కనీస వివాహ వయస్సు పెంపుపై అధ్యయనంతో పాటు.. కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తోందని వెల్లడించారు.

కాగా ప్రధాని కరోనా అంతమొందించే టీకా కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ కోసం మన శాస్త్రవేత్తలు తపస్సులా పరిశోధనలు చేస్తున్నారని కొనియాడారు. వారి శ్రమ త్వరలోనే ఫలిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు వ్యాక్సిన్లు తుది దశ పరీక్షల్లో ఉన్నాయని ప్రధాని వివరించారు.


వెయ్యి రోజుల్లో ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ నెట్‌ను తీసుకెళ్లామని, ఆరేళ్లలో లక్షన్నర గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. జీఎస్టీతో చాలా వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని అన్నారు. ప్రపంచానికి గొప్ప వృత్తి నిపుణులను అందించిన ఘనత భారత మధ్యతరగతిదేనని మోడి పేర్కొన్నారు.


కాగా ఈరోజు మోడి నేషనల్‌ డిజిట్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని మోడి వెల్లడించారు. దేశంలోని ప్రతి ఒక్కరికి ఐడీ కార్డు లభిస్తుంది. వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది అని ప్రధని మోడి వెల్లడించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/