ట్రాఫిక్‌ జరిమానాలను తగ్గించిన గుజరాత్‌ ప్రభుత్వం

Gujarat CM Vijay Rupani

Gandhi Nagar (Gujarat) : మోటార్‌ వాహనాల చట్టం కింద ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారికి విధించే జరిమానాలను గుజరాత్‌ ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఈ చట్టం కింద దేశవ్యాప్తంగా భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. కాగా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తమ రాష్ట్రంలో జరిమానాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. హెల్మెట్‌ ధరించకపోతే జరిమానా వెయ్యి రూపాయిలు కాగా దానిని 500 రూపాయిలకు తగ్గించారు. అలాగే నూతన మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం సీటు బెల్టు పెట్టుకోని వారికి వెయ్యి రూపాయిలు జరిమానా విధించాల్సి ఉండగా గుజరాత్‌ ప్రభుత్వం దానిని 500 రూపాయిలకు తగ్గించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే ద్విచక్ర వాహనాలకు 2 వేల రూపాయిల జరిమానా, ఇతర వాహనాలకు 3 వేల రూపాయిల జరిమానా విధించనున్నారు. నూతన చట్టం కింద దేశంలోని ఇతర ప్రాంతాల్లో దీనికి 5 వేల రూపాయిల జరిమానా విధిస్తున్నారు.