ఏపీలో వచ్చే నెల నుంచి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ

ఏపీలో రేషన్ దారులకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే నెల నుంచి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలో పీడీఎస్‌ ద్వారా జొన్నలు, రాగుల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. దీనికి సంబంధించి అవసరమైన రాగులు, జొన్నల సరఫరాకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు.

రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు రెండు కిలోల గోధుమ పిండిని పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఉత్తరాంధ్రలోని మున్సిపాలిటీల్లో అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల నాలుగు నుంచి తణుకు నియోజకవర్గంలోనూ ప్రారంభిస్తున్నామని.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గోధుమ పిండి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను కేంద్రం ప్రశంసించిందని మంత్రి తెలిపారు. జియో ట్యాగ్ సిస్టం ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేస్తున్నామని.. స్మార్ట్ పీడీఎస్ విధానం అమలు చేస్తున్నామన్నారు. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన రూ.1,702 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయడంపై కేంద్రంతో చర్చించామన్నారు.