ఫెదరర్‌కు షాక్‌!

FEDERAR
FEDERAR

ఫెదరర్‌కు షాక్‌!

ప్రభాతవార్త స్పోర్ట్స్‌ ప్రతినిధి: స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు అతిపెద్ద షాక్‌. కెరీర్‌లో 100వ టైటిల్‌తో ఈ ఏడాదిని ముగించాలని ఆశించిన స్విట్జర్ల్యాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఈ సీజన్‌ చివరి టోర్నీ ఎటిపి వరల్డ్‌ టూర్‌ ఫైనల్‌్‌స ఓడిపోయాడు. లీటన్‌ హెవిట్‌ గ్రూప్‌లో భాగంగా జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఫెదరర్‌ 6-7(4/7), 3-6తో కీ నిషికోరి (జపాన్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ఫెదరర్‌ జపాన్‌ ఆటగాడు నిషికోరితో జరిగిన మ్యాచ్‌లో తడబడ్డాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్‌లో ఇద్దరూ సర్వీసులను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. ట్రై బేకర్‌లో మొదటి నుంచి దూకుడు ప్రదర్శించి 6-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన నిషికోరి 7-4తో తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. ఇక, రెండో సెట్‌లో 20 అనవసర తప్పిదాలు చేసిన ఫెదరర్‌ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రెండో సెట్‌లోని తొలి గేమ్‌లోనే నిషికోరి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఫెదరర్‌ ఆ వెంటనే తన సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. ఆరో గేమ్‌లో ఫెదరర్‌ సర్వీస్‌ను రెండో సారి బ్రేక్‌ చేసిన నిషికోరి ఆ తర్వాత తన సర్వీసులను నిలబెట్టుకొని సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ మొత్తంలో ఫెదరర్‌ 34 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ఈ ఓటమితో సెమీస్‌ చేరే అవకాశాన్ని ఫెదరర్‌ సంక్లిష్టం చేసుకున్నాడు. ర్యాంకింగ్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న ఆటగాళ్లను రెండు గ్రూపులుగా విడదీసి ఎటిఎఫ్‌ ఫైనల్‌ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో కెవిన్‌ అండర్సన్‌ 6-3, 7-6(12-10)తో డోమ్నిక్‌ థీమ్‌పై విజయం సాధించాడు.