కరోనా వైరస్‌ను గుర్తించిన వైద్యుడు మృతి

‘సార్స్’ లాంటి వైరస్ ప్రపంచాన్ని కబళించబోతోందంటూ ముందే హెచ్చరించిన లీ

Li Wenliang
Li Wenliang

బీజింగ్‌: చైనాతో పాటు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్‌ గురించి ముందే హెచ్చరించిన చైనా యువ వైద్యుడు డాక్టర్ లీ వెన్‌లియాంగ్ (34) ఈ తెల్లవారుజామున అదే వైరస్ బారినపడి మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన పనిచేసిన వుహాన్ సెంట్రల్ ఆసుపత్రి ప్రకటించింది. సీఫుడ్ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు ఆమధ్య అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వారిని పరీక్షించిన డాక్టర్ లీ వారిలో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఈ వైరస్ తీవ్ర ప్రమాదకరమని గుర్తించిన లీ.. ఇది మరింత విస్తరించి ప్రాణాలు బలిగొనే అవకాశం ఉందని ప్రపంచాన్ని హెచ్చరిస్తూ గతేడాది డిసెంబరు 30న సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘సార్స్’ లాంటి ప్రమాదకర వైరస్ వుహాన్‌లో విస్తరిస్తోందని హెచ్చరించారు. ఈ పోస్టును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అతడిని ఇబ్బంది పెట్టింది. వైరస్ గురించి అపోహలు ప్రచారం చేస్తున్నందుకు పోలీసులు అతడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కాగా, ఆ తర్వాత అదే వైరస్ బారిన ఆయన పడ్డారు. గత నెల 12 నుంచి చికిత్స పొందుతున్న లీ గురువారం అర్ధరాత్రి దాటాక 2:58 గంటలకు కన్నుమూశారు. ఆయనను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/