ఢీల్లీలో అల్లర్ల కారణంగా సీబీఎస్‌ఈ పరీక్షల వాయిదా

నేడు ఈశాన్య ఢిల్లీలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసివేత

delhi-violence-cbse-postpones-10th-12th-exams
delhi-violence-cbse-postpones-10th-12th-exams

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న అల్లర్లు మరింత పెట్రేగిపోతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం బిల్లకు మద్దతు తెలుపుతున్న వారు, వ్యతిరేకిస్తున్న వారు రెండు వర్గాలుగా చీలి దాడులకు తెగబడుతున్నారు. పలు ప్రాంతాల్లో సోమవారం ప్రారంభమైన ఈ ఘర్షణలు మరింత హింసాత్మకంగా మారాయి. రాళ్లదాడికి పాల్పడటం, దుకాణాలు, వాహనాలను తగలబెట్టడం ఇలా ఆందోళనలు నానాటికీ మరింత హింసాత్మకంగా మారుతుండటం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ(సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) బుధవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలో మొత్తం 86 పరీక్ష కేంద్రాలుండగా.. ఇక్కడ 10,12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అత్యవసర నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈశాన్య ఢిల్లీ మినహా మిగతా ప్రాంతాల్లో యధావిధిగా పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తిరిగి ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించనున్నామనేది త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది. మరోవైపు ఈశాన్య ఢిల్లీలో నేడు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోడియా ప్రకటించారు. అన్ని పాఠశాలల్లో ఇంటర్నల్‌ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/