అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలి

gautam gambhir
gautam gambhir

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్‌, ఢిల్లీ తూర్పు నియోజకవర్గం బిజపి అభ్యర్ధి గౌతమ్‌ గంభీర్‌ తనపై ఆప్‌ నేతలు చేస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. ఆప్‌ నేతలు తనపై చేసే ఆరోపణలన్నీ తప్పుడువని, వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో వారిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. తనకు వ్యతిరేకంగా అశ్లీల, అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన కరపత్రాలను గంభీర్‌ పంచుతున్నారని ఆప్‌ నేత అతిషీ గురువారం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన గంభీర్‌ అతిషీతో పాటు ఢిల్లీ సియం కేజ్రీవాల్‌, మనీష్‌ పిసోడియాకు పరువు నష్టం నోటీసులు పంపారు. కేజ్రివాల్‌ ఈ స్థాయికి దిగజారుతారని తాను అనుకోలేదని గంభీర్‌ అన్నారు. మీ ఆరోపణల్లో నిజం ఉందని భావిస్తే తనపై చట్టపరమైన చర్యలు తీసుకోమని, అందుకు తగిన ఆధారాలు ఉంటే తనపై కేసు నమోదు చేయాలి కాని ఇలా దిగజారి అసత్య ఆరోపణలు చేయడం భావ్యం కాదని ,తాను కోర్టులో వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని గంభీర్‌ మీడియాతో వ్యాఖ్యానించారు. మరోవైపు గంభీర్‌ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పిసోడియా..తాము కూడా పరువు నష్టం దావా వేస్తామని వ్యాఖ్యానించారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/