ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం..8 మంది మృతి

నేటి తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్

Ahmedabad COVID-19 hospital fire

అహ్మదాబాద్‌: ‌గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఈరోజు తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. అహ్మ‌దాబాద్‌లోని న‌వరంగ్‌పురాలో ఉన్న శ్రేయ్ ఆసుపత్రి‌లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి. అవి ఇత‌ర బ్లాకుల‌కు వ్యాపించాయి. దీంతో ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది రోగులు మ‌ర‌ణించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో 35 మందిని వేరే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎనిమిది ఫైర్ ఇంజన్లు, 10 అంబులెన్స్ లు ఘటనా స్థలికి చేరుకున్నాయి.

ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులోనే అత్యధిక నష్టం సంభవించింది. ఇక్కడ చికిత్స పొందుతున్న ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు కన్నుమూశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం 50 పడకల సామర్థ్యమున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది రోగులున్నారు. మిగతా వారిని అందరినీ కాపాడి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, అగ్నిప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియ‌లేదు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/