బిజెపిపై ప్రతిరోజూ పోరాటం

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: బిజెపిపై ప్రతిరోజూ పోరాటం సాగిస్తామని, తమకు లోక్‌సభలో 52 సీట్లు దక్కాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని రాహుల్‌ పట్టుబట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మౌనంగా ఉంటున్న రాహుల్‌ నేడు తొలిసారిగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభలో మనకు ఇంకా 52 మంది సభ్యులున్నారు. సరైన సిద్దాంతాల కోసం బిజెపితో ప్రతిరోజూ పోరాడుదాం అని రాహుల్‌ పార్టీ ఎంపీలనుద్దేశించి అన్నారు.
కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా మరోసారి సోనియాగాంధీని ఎన్నుకున్నారు. ఐతే లోక్‌సభ పార్టీ పక్ష నేత ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకు ఈ పదవిలో కాంగ్రెస్‌ సీనియర్‌ మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో గుల్బర్గా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా రాహుల్‌ను ఎన్నుకోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లోక్‌సభ పక్షనేతగా రాహుల్‌ను ఎన్నుకుంటే కాంగ్రెస్‌ అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలనే ఆలోచనను ఆయన విరమించుకుంటారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/