మధుకాన్‌ సంస్థపై కేసులు నమోదు

బ్యాంకులకు వెయ్యి కోట్లకు పైగా కుచ్చు టోపి
ఎన్‌హెచ్‌-33 నిర్మాణంలో అవకతవకలు
నామా నాగేశ్వరరావు సంస్థ బాగోతం

madhucon projects
madhucon projects

హైదరాబాద్‌: తెలంగాణ టిడిపిలో కీలక నేత నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్‌ సంస్థపై సిబిఐ కేసు నమోదైంది. జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి కెనకాబ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రూ. 1029 కోట్ల మేర నష్టం కలిగించిన ఆరోపణలపై జార్ఖండ్‌ రాజధాని రాంచీలో కేసు నమోదు చేశారు. ఎన్‌హెచ్‌-33 నిర్మాణం కోసం మధుకాన్‌ సంస్థ స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌గా ఏర్పాటు చేసిన రాంచీ ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ సిఎండి శ్రీనివాసరావు, డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీతేజతో పాటు మధుకాన్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌, మధుకాన్‌ ఇన్‌ఫ్రా, మధుకాన్‌ టోల్‌ హైవే లిమిటెడ్‌, ఆడిటింగ్‌ సంస్థలు, కోటా అండ్‌ కంపెనీపై రాంచీ సిబిఐ అడిషనల్‌ ఎస్పీ వెరోనిక లక్రా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బ్యాంకుల కన్సార్షియానికి చెందిన కొందరు అధికారులపైనా కేసు నమోదు చేశారు. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, నకిలీ ధ్రువపత్రాల వినియోగం, అకౌంట్లను తారుమారు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో నేరపూరిత దుష్ప్రవర్తన అభియోగాల కింద ఐపిసి 120-బి రెడ్‌విత్‌ 420 పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఎన్‌హెచ్‌-33లో భాగంగా రాంచీ నుంచి జంషెడ్‌పూర్‌ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నాలుగులేన్ల జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్టును మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ను మధుకాన్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో మధుకాన్‌ సంస్థ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌ పేరుతో ఎస్పివీని ఏర్పాటు చేసింది. రూ 1655 కోట్లు విలువైన ఈ ప్రాజెక్టుకు కెనరాబ్యాంకు నేతృత్వంలో 15 బ్యాంకుల కన్సార్షియం రూ.1151 కోట్లు రుణం అందించేందుకు అంగీకరించింది. ఐతే మధుకాన్‌ కంపెనీ డైరెక్టర్లు మోసపూరితంగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, అకౌంట్లు తారుమారు చేసి బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ. 1029 కోట్లు కొల్లగొట్టారు. వాటిని మధుకాన్‌ గ్రూప్‌నకు చెందిన పలు సంస్థల్లోకి మళ్లించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈ ఏడాది జనవరి 31న నిర్మాణ కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ తతంగం వాస్తవమేనని తేలడంతో జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు మంగళవారం మధుకాన్‌ సంస్థపై కేసులు నమోదు చేశారు.