20 కంటే ఎక్కువ వాహనాలు ఉంటే టోల్‌ రద్దు!

TOLL GATE
TOLL GATE

హైదరాబాద్‌: ఇక నుండి బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌)పై టోల్‌ ఛార్జీల చెల్లింపు నిరీక్షణకు తెరపడనుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఛార్జీలు చెల్లించకుండానే దూసుకెళ్లొచ్చు. 20 కంటే ఎక్కువ వాహనాలు ఒకటే టోల్‌ వరుసలో నిరీక్షిస్తుంటే ఈ నిబంధనను వర్తింపజేయాలని హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) తాజాగా నిర్ణయించింది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలంటూ టోల్‌ ఛార్జీలను వసూలు చేసే గుత్తేదారు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ముంబయి, నాగ్‌పుర్‌, వరంగల్‌, విజయవాడ, బెంగళూరు వైపే వెళ్లే జాతీయ రహదారులతో ఓఆర్‌ఆర్‌ను అనుసంధానం చేయడంతో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ప్రతి రోజు సగటున 1.25 లక్షల వాహనాలు వెళుతున్నాయి. పండగలు, వరుస సెలవులు వస్తే టోల్‌ చెల్లింపు కేంద్రాల దగ్గర వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. వాహనాలు బారులు తీరుతున్నాయి. గంటల కొద్దీ టోల్‌ చెల్లింపు కేంద్రాల వద్దే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సంక్రాంతి పండగ సమయాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టోల్‌ రుసుములను వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.