అన్నివర్గాలకు న్యాయం చేసేలా బిజెపి మేనిఫెస్టో

k laxman
k laxman

మాది ప్రజా మేనిఫెస్టో..వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట..
పేదలకు పక్కా ఇళ్లు..ఇచ్చేవరకు ఇంటికిరాయి రూ.5 వేలు చెల్లింపు!
నిరుద్యోగ భృతి-30 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ
-రాష్ట్ర అధ్యక్షులు డా.కె. లక్ష్మన్‌
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా బిజెపి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె. లక్ష్మన్‌ వెల్లడించారు. తమది ప్రజా మేనిఫెస్టో అని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, విద్యా, వైద్యం, ఉపాధి రంగాలకు ఇందులో పెద్దపీట వేవామని లక్ష్మన్‌ పేర్కొన్నారు. బిజెపి ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, సభ్యులు డా.ఎస్‌. మల్లారెడ్డి, రాకేష్‌రెడ్డి, దిలీప్‌, సుభాషిణిలు శుక్రవారం మేనిఫెస్టో డ్రాఫ్ట్‌ను లక్ష్మన్‌కు సమర్పించారు. ఈసరదర్బంగా పత్రికా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలతోపాటు విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు తదితర అన్నివర్గాలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో మోసం చేసిందని విమర్శించారు. వారందరికి న్యాయం చేసే దిశలో, క్షేత్రస్థాయిల వారి అభిప్రాయాలు సేకరించి, అన్నివర్గాలకు అనుకూలంగా ప్రజా మేనిఫెస్టోను రూపొందించినట్లు లక్ష్మన్‌ స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్‌ నిర్ధారించే ప్రణాళిక రూపొందించామన్నారు. త్వరలోనే మేనిఫెస్టోను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.
గత నెలన్నరగా మేనిఫెస్టో కమిటీ సభ్యులు వివిధ రంగాల నిపుణులు, వర్గాల వారిని క్షేత్రస్థాయిలో కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారని లక్ష్మన్‌ తెలిపారు. 580 మంది నుంచి వినతులు తీసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో రూపొందించామన్నారు. ఆన్‌లైన్‌లో కూడా సలహాలు , సూచనలు తీసుకున్నామన్నారు. యువత, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కూడా అధిక ప్రాధాన్యం మేనిఫెస్టోలో ఇచ్చామని ఆయన తెలిపారు. ఇళ్లు లేని వారికి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని..ఇచ్చేలోపుగా ఇంటి కిరాయి నెలకు రూ.5 వేలు అద్దె చెల్లిస్తామన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. ఒకేసారి 30 వేల టీచర్‌ పోస్టులకు మెగా అడిఎస్సీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అన్ని కులాలకు, ఇబిసిలకు భవనాలు..కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. టిఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ విద్యను, పాఠశాలను నిర్వీర్యం చేసి..కార్పొరేట్‌ విద్య సంస్థలను ప్రొత్సహించారనీ..యూనివర్సిటీల్లో ఒక్క పోస్టు కూడా భర్తీచేయలేదని ఆయన మండిపడ్డారు. తమ మేనిఫెస్టోలో ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చిమని, యూనివర్సిటీలకు పూర్వవైభవం తెస్తామని లక్ష్మన్‌ వివరించారు.
బిజెపి మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ సకల జనుల సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా తాము మేనిఫెస్టోను రూపొందించామన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా అన్ని రంగాలను నాశనం చేశారన్నారు. రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఉద్యోగాల ఇచ్చేవరకు నిరుద్యోగులకు భృతి కల్పించటం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు ప్రభాకర్‌ పేర్కొన్నారు.

25 నుంచి 27 వరకు అమిత్‌ షా ప్రచార సభలు..!
డిసెంబరు మొదటి వారంలో ప్రధాన మోడీ 3 సభలు!!
ఈనెల 25, 26,27 తేదీల్లో పలు నియోజకవర్గాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా పాల్గొననున్నారు. అలాగే డిసెంబర్‌ మొదటి వారంలో రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొంటారని బిజెపి వర్గాలు తెలిపాయి.