త్రివిధ దళాల మహాధిపతిగా బిపిన్ రావత్

భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు.

Bipin Rawat
Bipin Rawat

న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రావత్ ప్రస్తుతం దేశ సైనిక దళాల ప్రధానాధికారిగా ఉన్నారు. ఈరోజుతో ఆర్మీచీఫ్‌గా రావత్ పదవీకాలం పూర్తి అవుతుంది. ఈ తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం సిడిఎస్ నియామకం గురించి అధికారిక ప్రకటన వెలువరించింది. ప్రస్తుత నిబంధనల మేరకు సైన్యం, వాయుసేన, నౌకాదళ అధిపతులు పదవులలో గరిష్టంగా మూడేళ్లు లేదా వారు 62 ఏండ్ల వయస్సుకు చేరుకునే వరకూ ( ఇందులో ఏది ముందయితే అది) కొనసాగవచ్చు. ఇక సిడిఎస్ వయోపరిమితిని ఒక్కరోజు క్రితమే కేంద్రం 65 ఏళ్లుగా ఖరారు చేసింది. సైన్యం, వాయు, నౌకా దళాల సమన్వయకర్తగా, కేంద్రానికి రక్షణ సైనిక వ్యవహారాలలో ప్రధానసలహాదారుడిగా ఉండే ప్రక్రియగా సిడిఎస్ సృష్టికి ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది.

2016 డిసెంబర్ 31వ తేదీన సైనికదళాల ప్రధానాధికారిగా రావత్ బాధ్యతలు తీసుకున్నారు. సిడిఎస్ పదవిని త్రివిధ బలగాల అధినేతగా కూడా వ్యవహరిస్తారు. వచ్చే ఏడాదిమార్చితో రావత్ వయస్సు 62 ఏండ్లకు చేరుకుంటుంది. సిడిఎస్‌కు 65 ఏండ్ల పరిమితి ఉండటంతో ఆయన కనీసంమూడేళ్లు ఈ పదవిలో ఉండేందుకు వీలేర్పడుతుంది. ప్రస్తుతం ఆర్మీ ఉప అధినేతగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరావానే తదుపరి ఆర్మీచీఫ్ అవుతారని భావిస్తున్నారు. దేశంలో త్రివిధ బలగాల మధ్య మరింత సమవ్వయం కోసం సిడిఎస్ ఏర్పాటు జరుగుతుందని ప్రధాని మోడీ ఈ ఏటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలిపారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/