బాధితులను ఆదుకోవడమే ధ్యేయం

AP MINISTER LOKESH
AP MINISTER LOKESH

కష్టాల కడలిలో సిక్కోలు

రాజకీయాలకు సమయం కాదు
సర్పంచ్‌ కాకపోతే మంత్రి కాకూడదా!
కౌన్సిల్‌ను పవన్‌ అవమానించడమే
రండి… కలిసి పనిచేద్దాం

మంత్రి లోకేష్‌తో ‘ప్రభాతవార్త ప్రత్యేక ఇంటర్వ్యూ

ఎం.పి శాంతిస్వరూప్‌ / శ్రీకాకుళం

తిత్లీ తుఫాన్‌ ప్రభావానికి అష్టకష్టాలు పడు తున్న బాధితులను ఆదుకోవాల్సిన సమయంలో ఆదుకోలేదు సరికదా… రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదు. ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడానికి వస్తే… ప్రతీఒక్కరినీ అభినందిస్తాం. వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వ్యక్తులు పట్ల మాట్లా డటం సరైన సమయం కాదు. ఏదిఏమైనా తనను విమర్శించడం కౌన్సిల్‌ను అవమానిం చినట్టే… తిత్లీ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల బాధితులకు ఆదుకోవడం, పునరావాసం, పునరుద్దరణ, సహయక చర్యలు వంటి వాటిపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణా భివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్‌ పెదవి విప్పారు. మంగళవారం ”ప్రభాతవార్త ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ… ఉత్తరాంధ్రలో వెనుకబడి ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తిత్లీ తుఫాన్‌ ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిందని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. ప్రదానంగా శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా 14 మండలాలకు పైగా పూర్తిగా సర్వం కోల్పోయరన్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో బాధితులను ఆదుకోవాల్సి ఉంద న్నారు.

అలా కాకుండా కొంతమంది నాయ కులు తమపై కావాలని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పంచాయతీ సర్పంచ్‌ కాని వ్యక్తులు మంత్రులు కాకూడదన్న ఎక్కడా లేదన్న విషయం జనసేన అధినేత పవన ్‌కల్యాణ్‌ తెలుసుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే సిక్కోలు! జిజి బాగుంటుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ విమర్శలపై తాను మాట్లాడే పరిస్థితిలో లేనని.. కష్టాల్లో ఉన్న సిక్కోలు జనాన్ని ఆదుకోవడానికి తనవంతుగా ప్రయత్నం చేస్తున్నానన్నారు. అంతేకాకుండా అమెరికాలో జరగనున్న ప్రత్యేక సమావేశానికి కూడా వెళ్ళకుండా బాధితులను ఆదుకోవడానికి సర్వశక్తులూ ప్రయత్నిస్తున్నానన్నారు.

పవన్‌కల్యాణ్‌ లాంటి వ్యక్తులు ఇలాంటి ప్రకృతి పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవాలే తప్ప రాజకీయం కోసం మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తనపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ నేటికీ రుజువు చేయలేదని గుర్తు చేశారు. 15 సార్లు ఆరోపణలు చేశారని ఏ ఒక్కటైనా ఇంతవరకు రుజువు చేయగలిగారని మంత్రి లోకేష్‌ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. ప్రదానంగా తాను మంత్రిని కావడానికి సర్పంచ్‌ కావాల్సిన అవసరం లేదని తాను శాసనమండలి సభ్యుడనన్న విషయం పవన్‌కు తెలీదా అని మంత్రి లోకేష్‌ గుర్తు చేశారు. తనను అనే ముందు తాను శాసనమండలి కౌన్సిల్‌ సభ్యుడనన్న విషయాన్ని తెలుసుకోవాలని పవన్‌కు సూచించారు.

పవన్‌ దవళేశ్వరంలో విమర్శించిన వాటిని తన విజ్ఞతకే విడిచిపెడుతున్నానని అంతేకాకుండా కౌన్సిల్‌ను తీవ్రంగా అవమానపరిచారని లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత ప్రాంతాల్లో ఎలాంటి సహయక చర్యలు చేపట్టడం లేదని, బాధితులు గోడు పెడుతున్నారని ప్రతిపక్షనేత వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి విమర్శించడం సరైంది కాదన్నారు. తన పార్టీ తరపున కోటి రూపాయలు ప్రకటించడం సరికాదని తానే స్వయంగా బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఆ కోటి రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు నేరుగా నిత్యావసర వస్తువులు అందిస్తే బాధితులు సంతోషించేవారన్నారు. ఎక్కడో ఉండి బాధితులకు ఏమీ అందడం లేదని, సహయక చర్యలు చేపట్టడం లేదని నాయకులు విమర్శించడం సరికాదన్నారు. వాస్తవిక పరిస్థితులు తెలుసుకుని ప్రజాప్రతినిధులు మాట్లాడాలని మంత్రి లోకేష్‌ సూచించారు. జిల్లాలో 40 మంది ఐ.ఎ.ఎస్‌ అధికారులు, ఐఎప్‌ఎస్‌ అధికారులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు, ఇతరత్రా అధికారులు బాధిత ప్రాంతాల్లో నిరంతరం పర్యటించి బాధితులకు యుద్ద ప్రాతిపదికన సహయక చర్యలు చేపడుతున్నారని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. తిత్లీ తుఫాన్‌ ప్రభావం వలన శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిందని, ప్రదానంగా ఉద్దానం ప్రాంతం కోలుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. అన్ని రంగాల్లో సహయక చర్యలు జరుగుతున్నాయని అయితే విద్యుత్‌ సరఫరా పునరుద్దరణ కష్టమవుతుందన్నారు. ఏదిఏమైన విద్యుత్‌ సరఫరా మరింత పునరుద్దరించేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామన్నారు.

బుధవారం సాయంత్రం నాటికి పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా జరుగుతుందని మంత్రి లోకేష్‌ వివరించారు. ఇప్పటికే చాలావరకు మండల కేంద్రాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్దరించామన్నారు. అంతేకాకుండా తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మల్టీ పర్పస్‌ స్కీమ్‌లను రీస్టోర్‌ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఉదాహరణకు మందస మండలంలో 19 రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయని వాటిలో 17 పథకాలను పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఉద్దానం ప్రాంతంలో కొన్నింటిని పూర్తి చేయాల్సి ఉందని, అయితే విద్యుత్‌ సమస్య కారణంగా కొంత ఆటంకం జరుగుతుందన్న మాట వాస్తవమన్నారు. ఉద్దానం ప్రాంతంలో తాగునీటి కోసం ప్రత్యేకంగా వంద జనరేటర్లు, 120 ట్యాంకుల ద్వారా మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. అన్ని రేషన్‌ డిపోలద్వారా నిత్యావసర సరుకులను బాధితులకు అందజేయడం జరుగుతుందన్నారు. చాలావరకు గిరిజన గ్రామాలు ఉన్నాయని, గిరిజనులకు పూర్తిస్థాయిలో సహయక చర్యలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. తిత్లీ తుఫాన్‌ ప్రభావానికి ప్రదానంగా సమాచార వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి సహయక చర్యలు అందిస్తున్నారో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగానే 13 మండలాల్లో మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారని ఒక్కొక్క మండలంలో 11 నుంచి 13 వరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

వారితో ఎప్పటిప్పుడు సి.ఎం మాట్లాడుతూ సహయక చర్యలపై ఆరా తీస్తున్నా రన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ ఇంకనూ పునరుద్దరణ కాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో వాకీటాకీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంత్రి లోకేష్‌ తెలిపారు. కేంద్రం నుంచి సాయం ఏమీ లేదు! తిత్లీ తుఫాన్‌ ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో కొంత ప్రాంతాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయాన్ని అందించలేదని మంత్రి లోకేష్‌ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. తిత్లీ తుఫాన్‌ ప్రభావంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నష్టాన్ని పూర్తిస్థాయిలో ప్రదానమంత్రి నరేంద్రమోడీకి వివరించారని అంతేకాకుండా లేఖరాశారన్నారు.

దాదాపుగా 12వందల కోట్లు అవసరమని లేఖలో పేర్కొనడం జరిగిందన్నారు. అయినప్పటికీ ప్రధానమంత్రి ఇంతవరకు ఎలాంటి సాయం అందించలేదని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. అయితే ప్రదాని నుంచి సాయం అందినా అందక పోయినా బాధితులను ఆదుకోవడం విషయంలో వెనుకంజవేసేది లేదని మంత్రి లోకేష్‌ తెలిపారు. ఇప్పటికే బాధితులకు అన్ని విధాల ఆదుకునేందుకు రాష్ట్రస్థాయిలో స్వచ్చంద సంస్థలతో పాటు అనేక సంస్థలు ముందుకొస్తు న్నాయని మంత్రి లోకేష్‌ తెలిపారు. రానున్న రోజుల్లో బాధితులను ఆదుకోవడానికి ప్రతీ ఒక్కరూ రాష్ట్ర ప్రజానీకం ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.