రిలయన్స్‌ ఇండ్రస్టీస్‌కు మరో ఘనత

ఎక్సన్ మొబిల్ కార్పొరేషన్ ను దాటేసిన రిలయన్స్

Mukesh-Ambani

ముంబయి: రిలయన్స్‌ ఇండ్రస్టీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇటీవలే ప్రపంచ కుబేరుల జాబితాల్లో 5వ స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన ఇంధన సంస్థగా నిలిచింది. తొలి స్థానంలో సౌదీ అరామ్ కో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును వెలికితీస్తున్న సంస్థగా ఆరామ్ కో ఉండగా, అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్ ను రిలయన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం నాడు సంస్థ ఈక్విటీ విలువ 4.3 శాతం లాభం పొందగా, కంపెనీ మార్కెట్ వాల్యూ మరో 8 బిలియన్ డాలర్లు పెరిగి 189 బిలియన్ డాలర్లకు పెరిగింది.

దీంతో నిన్నటి వరకూ సౌదీ ఆరామ్ కో తరువాత రెండో స్థానంలో ఉన్నఎక్సన్ మొబిల్ కార్పొరేషన్ ను రిలయన్స్ మూడవ స్థానానికి పడేసింది. ఈ సంవత్సరంలో లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత, రిలయన్స్ లోకి వివిధ కంపెనీలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడంతో సంస్ణ ఈక్విటీ విలువ 43 శాతం వరకూ పెరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకు డిమాండ్ తగ్గడంతో ఎక్సన్ వాటాల విలువ 39 శాతం పడిపోయింది. ఇక తొలి స్థానంలో ఉన్న సౌదీ ఆరామ్ కో మార్కెట్ విలువ 1.76 ట్రిలియన్ డాలర్లతో ఎవరికీ అందనంత స్థానంలో కొనసాగుతోంది.

మార్చి 31తో ముగిసిన త్రైమాసికం వరకూ రిలయన్స్ ఆదాయంలో 80 శాతం పెట్రో కెమికల్ వ్యాపారం నుంచే వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో డిజిటల్, రిటెయిల్ విభాగాలను వృద్ధి చేసే ప్రణాళికలనురూపొందించిన ముఖేశ్ అంబానీ వెనుక ఎన్నో దిగ్గజ సంస్థలు నడిచాయి.దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందించాయి. ఈ పెట్టుబడులు అంబానీ సంపదను సైతం పెంచాయి. దీంతో 22.3 బిలియన్ డాలర్ల వ్యక్తిగత ఆస్తులతో ప్రపంచ కుబేరుల స్థానంలో ఏకంగా ఐదో స్థానానికి ఆయన ఎగబాకారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/