దేశవ్యాప్తంగా పండుగలకు ప్రత్యేక రైళ్లు!

దేశవ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లు..రేపో, మాపో ప్రకటన

moving migrant workers to bihar
train

న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ఇళ్లకు వెళ్లాలనుకునే వారికి ఇది శుభవార్తే. పండుగల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లను నడపాలని యోచిస్తుండగా, అందులో 17 దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పట్టాలెక్కనున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న రెగ్యులర్ రైళ్లకు ఇప్పటికే రిజర్వేషన్ పూర్తయి పోవడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పండుగ డిమాండ్ నేపథ్యంలో తమకు 17 రైళ్లు కావాలంటూ దక్షిణ మధ్య రైల్వే పంపిన ప్రతిపాదనపై రైల్వే బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ప్రస్తుతం నడుస్తున్న గౌతమి, నర్సాపూర్, నారాయణాద్రి, చార్మినార్, శబరి, గువాహటి ఎక్స్‌ప్రెస్‌లతోపాటు మరో 11 రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. పండుగల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అదనంగా మరో 200 రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. వీటిని అధికారికంగా ప్రకటించిన వెంటనే రిజర్వేషన్ ప్రారంభం కానుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి అందుబాటులోకి రానున్న ప్రత్యేక రైళ్లలో.. సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం, గువాహటి, తిరుపతి, కాకినాడ, నర్సాపూర్, రాజ్‌కోట్, హౌరాకు రైళ్లు నడవనుండగా, హైదరాబాద్ నుంచి చెన్నై, జైపూర్, రాక్సల్‌కు, అలాగే కాచిగూడ నుంచి మైసూర్‌కు, కడప నుంచి విశాఖకు, పూర్ణ నుంచి పాట్నాకు, విజయవాడ నుంచి హుబ్బళ్లికి, తిరుపతి నుంచి మహారాష్ట్రలోని అమరావతికి, నాగ్‌పూర్ నుంచి చెన్నైకి, భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు రైళ్లు నడవనున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/