2, 3 నెల‌ల్లో స్ప‌ష్ట‌మైన ఎజెండా

KCR, AKHILESH
KCR, AKHILESH

హైద‌రాబాద్ః దేశంలో గుణాత్మక మార్పుకోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలకు మరో కీలక రాజకీయ శక్తి తోడైంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్న సమాజ్‌వాది పార్టీ.. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు పలికింది. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దేశ రాజకీయ పరిణామాలు, ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ, ఎజెండా, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సంయుక్త మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలో గుణాత్మకమైన మార్పు తేవడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని మరోమారు స్పష్టంచేశారు. దేశప్రగతి కోసమే అన్ని పార్టీలతో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, దీనిలో రాజకీయం కంటే.. దేశ అభివృద్ధే చూడాలని విజ్ఞప్తిచేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, రెండు, రెండున్నర నెలల్లో పూర్తి ఎజెండాతో ప్రజల ముందుకు వస్తామని, స్పష్టమైన ఎజెండానే ఫెడరల్ ఫ్రంట్‌కు చోదకశక్తికాబోతున్నదని వివరించారు.
దేశ రాజకీయాల్లో ఒక పరివర్తన, గుణాత్మకమైన మార్పు రావాలని జాతీయ రాజకీయాల్లో నేను క్రియాశీల పాత్ర పోషిస్తానని చెప్తూ వస్తున్నా. దానికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. కొంతమంది తెలిసీతెల్వక అదేదో చిన్న ప్రయత్నం అనుకుంటున్నారు. కేవలం రాజకీయ పార్టీలను కూడగట్టి, ఈ 2019 ఎన్నికల కోసం చేస్తున్న ప్రయత్నమని భావిస్తున్నారు. అది అలాంటి ప్రయత్నం కాదని నేను మొన్న చెన్నైలో కూడా చెప్పాను. ఇంతపెద్ద దేశంలో, ఇంత భిన్నత్వం ఉండే దేశంలో ఒక గుణాత్మక మార్పు తేవడం చాలా కష్టంతో కూడుకున్న పని. చాలామందికి చాలా అంశాలను వివరించాల్సి ఉంటుంది. వారందరినీ ఒప్పించాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం కొనసాగుతున్నది. అందులో భాగంగానే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ ఈ రోజు హైదరాబాద్ వచ్చారు. గత నెల రోజులుగా ఇద్దరం ఫోన్‌లో అభిప్రాయాలు పంచుకుంటున్నాం. నా బెంగళూరు, చెన్నై, కోల్‌కతా.. ఇట్లా ప్రతి పర్యటన వివరాలు నేను అఖిలేశ్‌యాదవ్‌కు వివరిస్తూనే ఉన్నా. ఈ రోజు హైదరాబాద్‌లో మేం అనేక అంశాలపై సవివరంగా మాట్లాడుకున్నాం. ఏవిధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించుకున్నాం.