2జీ కేసులో డీఎంకే నేత‌ల‌కు ఊర‌ట‌

kanimozhi
kanimozhi

న్యూఢిల్లీః 2జీ కుంభకోణం కేసులో డీఎంకే నేతలకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళి, డీఎంకే నేత ఏ రాజాను నిర్దోషులుగా తేల్చుతూ పాటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ప్రకటించింది. నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని కోర్టు చెప్పింది. 2007, 2008 మధ్య 2జీ స్కాం జరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి ఏ రాజా జైలు శిక్ష కూడా అనుభవించారు. రూ.1.76 లక్షల కోట్ల స్కాం జరిగినట్టు కేసు నమోదైంది. ఈ కేసులో అనుకూలంగా తీర్పు రావడంతో డీఎంకే పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ కేసుపై కోర్టు తీర్పు అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం సాధించిన ధర్మ విజయంగా కోర్టు తీర్పును ఆయన అభివర్ణించారు.