పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు

పెట్రోల్‌పై రూ.10.. డీజిల్‌పై 13.. ఎక్సైజ్‌ సుంకాలు పెంచిన కేంద్రం

PETROL

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజీల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచింది. లీటరు పెట్రోలుపై రూ. 10, లీటరు డీజిల్ పై రూ. 13 మేరకు ఎక్సైజ్ సుంకాలను పెంచింది. ఈ మేరకు నిన్న సాయంత్రం కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన సుంకాలతో ప్రజలపై ఎటువంటి అదనపు భారమూ పడబోదని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానించారు. ఇటీవల ధరలు భారీగా తగ్గాయని గుర్తు చేశారు.ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా దిగిరాగా, ఆ మేరకు ఇండియాలోనూ పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇక, ఈ తగ్గిన ధరల మేరకు పన్నులను పెంచడం ద్వారా ఖజానాకు కోత పడకుండా చూసుకోవాలన్న ఆలోచనలో ఉన్న కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, తాజా ధరల పెంపు పెట్రోలుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంగా రూ. 2, రోడ్ సెస్ రూ. 8గా ఉంటుందని, డీజిల్ విషయంలో ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంగా రూ. 5, రోడ్ సెస్ రూ. 8గా ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయంతో సుంకాలు పెట్రోలుపై రూ. 32.98, డీజిల్ పై రూ. 31.83కు పెరిగాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/