హిందూపురం సిండికేట్‌ బ్యాంకులో మరో భారీ స్కాం

SYNDICATE BANK
SYNDICATE BANK

– నకిలీ బంగారం కుదువ పెట్టి రూ.50 లక్షలకు పైగా స్వాహా
– అప్రైజర్‌ చేతివాటం.. అధికారులపైనా అనుమానాలు
– గతంలో ఇదే బ్యాంకు కుంభకోణంలో రికవరీ కాని రూ.1.20 కోట్లు
హిందూపురం: హిందూపురం సిండికేట్‌ బ్యాంకులో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. పట్టణంలోని టీచర్స్‌కాలనీలో ఉన్న ఈ బ్యాంకు నందు కొన్నేళ్లుగా నకిలీ బంగారం అసలు బంగారంగా చూపించి వాటిని బ్యాంకులో పలుమార్లు కుదువ పెట్టి రూ.50 లక్షలకు పైగా సొమ్ము స్వాహా చేసినట్లు సమాచారం. ఈ మొత్తం ఉదంతానికి బ్యాంకు నందు ప్రైవేటు ఉద్యోగిగా వ్యవహరించే అప్రైజర్‌ కారణం అని బ్యాంకు అధికారులు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఆ అప్రైజర్‌ కొన్నేళ్ల క్రితం కష్టాల్లోనుంచి బయటపడేందుకు రియల్‌ఎస్టేట్‌ రంగంలో దిగి అక్కడా తీవ్రంగా నష్టపోవడంతో చివరకు తాను పనిచేసే బ్యాంకు నుండే బినామీల పేర్లతో నకిలీ బంగారం కుదువపెట్టి డబ్బును కాజేశారు. సాధారణంగా బ్యాంకు ఖాతాదారులెవరైన తమకు బంగారంపై లోన్‌ కావాలని బ్యాంక్‌కు వస్తే ఆ బంగారం నిజమైందా కాదా, ఎంత విలువు ఉంటుంది అని నిర్ణయించేందుకు విశ్వసనీయమైన అప్రైజర్‌ను నియమించుకుంటుంది. దీనిని ఆసరా చేసుకుని ఆ వ్యక్తి పలుమార్లు తనకు తెలిసిన వారిని ప్రేరేపించి నకిలీ బంగారంకు కోటింగ్‌ ఇచ్చి బ్యాంక్‌కు వచ్చేలా చేశాడు. ఆ తరువాత తానే దానిని పరిశీలించి అసలైనదిగా నిర్ధారించడంతో బ్యాంకు రుణం మంజూరు చేయడం జరిగింది. ఈ క్రమంలో సిండికేట్‌ బ్యాంకు యాజమాన్యం వివిధ ప్రాంతాల్లోని తమ బ్యాంకుల్లో బంగారం నాణ్యత పరిశీలన, తనిఖీలు చేసేందుకు స్పెషల్‌ అప్రైజర్లను నియమించగా ఆయన ఈనెల 7న ఇక్కడికి వచ్చి చూడగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అనంతపురం రీజనల్‌ కార్యాలయం నుంచి చీఫ్‌ మేనేజర్‌ కోదండరామిరెడ్డి, సీనియర్‌ మేనేజర్‌ రమేష్‌బాబు ఇక్కడికి వచ్చి విచారణ చేస్తున్నారు. కాగా ఈ వ్యవహారంలో కచ్చితమైన సొమ్ము ఎంత మంజూరు చేయడం జరిగిందని ప్రశ్నించగా వారు సమాధానాలు దాటవేశారు. తాము ఊరికే అలా వెళ్తూ ఇలా సాధారణ తనిఖీల కోసమే ఇక్కడికి వచ్చామని అబద్ధాలు చెప్పగా విలేకరులు గట్టిగా ప్రశ్నించడంతో తడబడ్డారు. జరిగింది నిజమేనని పూర్తి వివరాలు మీడియాకు చెబుతామని చెప్పినప్పటికీ వారు వెల్లడించలేదు. కాగా వ్యక్తిగతంగా బ్యాంకు అప్రైజర్‌ మంచివాడని అయితే తీవ్ర ఆర్థిక కష్టాలతో ఇలా చేశాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పోయిన సొమ్ము బ్యాంకుకు రికవరీ అయితే చాలురా అన్న విధంగా ఉన్నతాధికారుల ఆలోచన ఉన్నట్టు సమాచారం. ఈ ప్రకారంగానే ఇప్పటికి సుమారు రూ.20 లక్షలు సొమ్మును ఆ అప్రైజర్‌ వెనక్కి కట్టినట్లు మిగిలిన సొమ్ము ఒకట్రెండురోజుల్లో చెల్లిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. సొమ్ము చెల్లించకపోతే గోల్డ్‌ లోన్‌ 18 మంది పేర్లతో ఉన్నందున వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. కొన్నేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నందున బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉండొచ్చేమోనన్న అనుమానాలను ఖాతాదారులు వ్యక్తం చేస్తున్నారు.