స‌రి-బేసి విధానంలో ఎవ‌రికి మిన‌హాయింపులు ఇవ్వం..

odd even system in delhi
odd even system in delhi

ఢిల్లీః దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో అత్యంత ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకున్న కాలుష్యాన్ని నివారించే క్ర‌మంలో గ‌తంలో ప్ర‌వేశ‌పెట్టిన స‌రి-బేసి విధానాన్ని తిరిగి ప్ర‌వేశ‌పెట్ట‌నున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దీనిపై ఢిల్లీ ప్ర‌భుత్వం స్పందిస్తూ ఇప్ప‌టినుంచి సరి-బేసి విధానం అమలులో ఎవరికీ ఎటువంటి మినహాయింపు ఇవ్వబోమని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ)కు తెలిపింది. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు సంబంధించిన ప్రణాళికలను ప్రభుత్వం బుధవారం ఎన్‌జీటీ ముందు ఉంచింది. వాయు కాలుష్యానికి కారణమయ్యే భవన నిర్మాణ పనులను నిలిపివేస్తామని, ఢిల్లీలోకి ప్రవేశించే ట్రక్కులపై నిషేధం విధిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పాటు సరి-బేసి విధానం నుంచి మహిళలు, ద్విచక్రవాహనదారులకు కూడా మినహాయింపు ఇవ్వబోమని తెలిపింది. కాలుష్యాన్ని పెంచే పరిశ్రమలను మూసివేయడంతో పాటు వ్యర్థాలను తగులబెట్టడంపై నిషేధం విధిస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఎన్‌జీటీ గురువారం కూడా కొనసాగించనుంది. ఈ నేపథ్యంలోనే కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటో తెలియజేస్తూ నివేదిక సమర్పించాల్సిందిగా దిల్లీ, హరియాణా, పంజాబ్‌ ప్రభుత్వాలను ఎన్‌జీటీ ఆదేశించింది.