సుప్రీం న్యాయ‌మూర్తిగా ఇందూ ప్ర‌మాణ స్వీకారం

INDU MALHOTRA

న్యూఢిల్లీ: సీనియర్‌ న్యాయవాది ఇందు మల్హోత్రా నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్ర ఈరోజు ఉదయం ఇందు మల్హోత్రాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఓ మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులు కావడం ఇదే ప్రథమం. కొలీజియం సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం వెలువరించిన ఉత్తర్వుల మేరకు ఆమె ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.  కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల్లో ఇందూ నియామకాన్ని ఆమోదించిన ప్రభుత్వం ఉత్తరాఖండ్‌ చీఫ్‌ జస్టిస్‌ కెఎం జోసెఫ్‌ నియామకాన్ని తిరస్కరించడంతో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం అనంత‌రం  సుప్రీంకోర్టుకు ఆరుగురు మహిళా న్యాయమూర్తులు రాగా ఇందు మల్హోత్రా ఏడో వ్యక్తి. అయితే వారంతా హైకోర్టుల్లో అనుభవం ఉన్నవారే. ఇందూ మాత్రం నేరుగా న్యాయవాద వృత్తి నుంచి న్యాయమూర్తి అయ్యారు. 61ఏళ్ల ఇందూది న్యాయవాదుల కుటుంబం. పుట్టింది బెంగళూరులోనే అయినా చదువంతా దిల్లీలోనే సాగింది. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకుని, 1983లో ఆమె న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 1988లో కఠినతరమైన ‘అడ్వోకేట్‌ ఆన్‌ రికార్డ్‌’ పరీక్షలో ప్రథమురాలిగా నిలిచారు. 2007లో సీనియర్‌ న్యాయవాది అయ్యారు. ఇందూ మల్హోత్రా స్వయానా ఉద్యమకారిణి. పలు సామాజిక అంశాలపై పోరాటం చేశారు. ఆమెకున్న అనుభవంతో కీలక అంశాలపై న్యాయ నిపుణురాలిగా మధ్యవర్తిత్వం వహించారు.