సీనియర్లు జీతాలు తగ్గించుకుంటే యువతకు ఉపాధి భద్రత!

INFOSYS NARAYANA
INFOSYS NARAYANA

సీనియర్లు జీతాలు తగ్గించుకుంటే యువతకు ఉపాధి భద్రత!

ముంబయి, జూన్‌ 2: ఐటి కంపెనీలు ఉపాధి కల్పనలో ఉద్యోగులకు భద్రత కల్పించాలంటే సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు తమ జీతాల్లో కొంత కోత విధించుకోవాలని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి వెల్లడించారు. గతంలో కూడా ఐటిరంగం ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోగలిగిందని అన్నారు. ఐటిరంగంలోని లేఆఫ్‌లను మొత్తం పారిశ్రామికవేత్తలు అందరూ సమిష్టిగా పరిష్కరించుకోగలరని ఆయన ధీమా వ్యక్తంచేసారు. ఐటిరంగంలో మంచి నేతలు ఉన్నా రని, లేఆఫ్‌లపై వారు ఖచ్చితమైన పరిష్కారాలను కనుగొనగలరని ఆయన అన్నారు. ఐటిరంగంలో లేఆఫ్‌ల సమస్య ఈనాడు కొత్తగా వచ్చిందేమీ కాదని, గతంలో కూడా అనేకసార్లు ఎదుర్కొన్నదని విజయవంతంగా అధిగమించగలిగినట్లు ఆయన వెల్లడించారు. 2001లోను 2008వ, సంవత్స రాల్లో కూడా ఇదేపరిస్థితి ఎదురయిందన్నారు. ఇదేమీ కొత్తకాదన్నారు. అందువల్ల ఐటిరంగం లేఆఫ్‌లపై కొత్తగా ఆందోళన చెందాల్సిందేమీలేదని నారాయణమూర్తి చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌లు, సీని యర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగులు వేతనాల్లో కోతను ఆహ్వానిస్తేయువ ఉద్యోగులకు ఉద్యోగభద్రత మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.

సీనియర్‌స్థాయి ఉద్యోగులు అంతర్గత డైరెక్టర్‌స్థాయి అధికారులు ఎక్కువ వేతనాల్లో కోతకు ముందుకు రావాలని సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ స్థాయి ఉద్యో గులుకూడా కొంతవేతనాల్లో తగ్గింపునకు ముందుకు రావాల్సి ఉంటుందన్నారు. ఇన్ఫోసిస్‌ 2001లో ఇదేవిధానం పాటించిందన్నారు. మార్కెట్లు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు 2001లో క్లిష్టసమస్యలు వచ్చిపడ్డాయి, అందరూ కలిసి సమిష్టిగా సంప్రదిం పులు జరిపి సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో జీతాలు తగ్గించుకునేందుకు నిర్ణయిం చామని వెనువెంటనే యువత ఉద్యోగ భద్రత పెరిగిందని ఆయన అన్నారు. ఆరోజుల్లో మేం 1500 మంది ఇంజినీర్లకు ఆఫర్లు ఇచ్చామని, అనేక కంపెనీలు జాయినింగ్‌ తేదీలను వాయిదా వేస్తూ వచ్చాయన్నారు.

మేం అలా చేయకుండా యువ ఉద్యోగులకు మంచి అవకాశాలిచ్చామన్నారు. ఐటిరంగ నాయకత్వ స్థాయి అధికారులకు కొత్త అవకాశాలు మెండుగా ఉన్నాయని, శిక్షణ కార్య క్రమాలతో యువతకు మంచి తర్ఫీదునిచ్చే అవకాశాలున్నాయన్నారు. టెక్నాలజీ పరిస్థితుల్లో మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్యం పెంచాల్సిన బాధ్యత సీనియర్లదేనన్నారు. ఒక ఉద్యోగిని నేరుగా ఇంటికి పంపించడం సహేతు కం కాదని, వారిపై ఆధారపడి కూడా కొందరు ఉంటారని వారికి కూడా పిల్లలు, తల్లితండ్రులు, భార్య ఉంటారని వారిజీవనభారం మరింతగా కృంగిపోవడానికి కంపెనీలు కారణం కాకూడదని నారాయణమూర్తి అభిన్రపాయపడ్డారు. అందు వల్లనే సీనియర్లు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి అధికారులు ఇందుకు ఖచ్చితమైన పరిష్కారాలు అన్వేషించి యువత ఉపాధికి భద్రత, హామీ కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.