సంప‌న్న సియంల జాబితాలో చంద్ర‌బాబు ముందంజ‌

Ap CM Chandra babu naidu
Ap CM Chandra babu naidu

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి అని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.177 కోట్లని (చంద్రబాబు ఆస్తులు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తులు కలిపి) పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమాఖండూ (రూ.129 కోట్లు), పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌సింగ్‌ (రూ.48 కోట్లు) ఉన్నట్లు వెల్లడించింది. వీరు ముగ్గురూ పాన్‌కార్డులు సమర్పించినట్లు తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులను ఆ సంస్థ సోమవారం వెల్లడించింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌, నేషనల్‌ ఎలెక్షన్‌ వాచ్‌ సంస్థలు సంయుక్తంగా ఆయా ముఖ్యమంత్రులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ ఆస్తులను పేర్కొన్నాయి. అత్యధిక ఆస్తులున్నవారి జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగోస్థానంలో నిలిచారు. ఆయనకు రూ.15.51 కోట్లున్నట్లు (కేసీఆర్‌ ఆస్తులు, ఆయన సతీమణి శోభ ఆస్తులు కలిపి) వెల్లడయింది. వీరిద్దరి చరాస్తులు రూ.6,50,82,464 కాగా, స్థిరాస్తుల విలువ రూ.8,65,00,000. అతితక్కువ ఆస్తులన్నవారి జాబితాలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ ఉన్నారు. ఈయనకు మొత్తం రూ.26 లక్షల ఆస్తులున్నాయి. ఆ తర్వాతి స్థానంలో మమతాబెనర్జీ (రూ.30లక్షలు), మెహబూబా ముఫ్తీ (రూ.55 లక్షలు) తేలారు. ఇందులో మాణిక్‌సర్కార్‌ పాన్‌ నెంబర్‌ ఇవ్వలేదు. రూ.వందకోట్లకుపైగా ఆస్తులున్న ముఖ్యమంత్రులు ఇద్దరు, రూ.10-50 కోట్ల మధ్య ఉన్నవారు ఆరుగురు, రూ.1-10 కోట్ల మధ్య ఉన్నవారు 17 మంది, రూ. కోటిలోపు ఉన్నవారు ఆరుగురు ఉన్నట్లు ఏడీఆర్‌ తేల్చింది. దేశంలోని 31 ముఖ్యమంత్రి పీఠాల్లో ముగ్గురు మహిళలు (10%), ఉంటే 28 మంది పురుషులు (90%) ఉన్నారు.