శ్రీలంక ప్రధానిగా విక్రమ్‌సింఘే పునర్నియామకం

vikram singhe
vikram singhe

కొలంబో: శ్రీలంక ప్రధాన మంత్రిగా రణిల్‌ విక్రమ్‌సింఘే తిరిగినియమితులయ్యారు.అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆయన్ను గత 1క్టోబరు 26వ తేదీ తొలగించినతర్వాత మళ్లీ పునిర్నయామకం చేసారు. యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ నేత రణిల్‌ విక్రమ్‌సింఘే 51రోజుల అధికార ప్రతిష్టంభనను తొలగిస్తూ శ్రీలంక ప్రధాన మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. 69ఏళ్ల విక్రమ్‌సింఘే చేత అధ్యక్షుడు సిరిసేనప్రమాణ స్వీకారంచేయించారు. యుఎన్‌పి నేత పదవీచ్యుతిపొందినప్పటినుంచి ఆయన పదవినుంచి వైదొలిగేందుకు నిరాకరించారు. ఆయన పునర్నియామకం శక్తివంతుడిగా పేరున్న మహీంద రాజపక్ష శనివారం రాజీనామా చేసేందుకు నిర్ణయించినట్లుప్రకటన వెలువరించిన వెంటనే సిరిసేన ఆయన్ను విధిగా నియమించాల్సి వచ్చింది. రెండు సుప్రీంకోర్టు నిర్ణయాలు ఆయనకు వ్యతిరేకంగా రావడంతో ఆయన రాజీనామా చేయకతప్పలేదు. పార్లమెంటు రద్దునిర్ణయం అక్రమమని, రాజ్యాంగవిరుద్ధమని, అలాగే ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంకూడా చెల్లనేరదని రాజపక్ష మెజార్టీ రుజువుచేసుకునేంతవరకూ ప్రధానిగా కొనసాగలేరని అన్నారు. అధ్యక్షుడు సిరిసేనతో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ, అధినేత సిద్ధమేనని యుఎన్‌పి పార్టీప్రకటన విడుదలచేసింది. సిరిసేనను కొన్ని స్వార్ధశక్తులు తప్పుదోవ పట్టించాయని అన్నారు. యుఎన్‌పి డిప్యూటి నేత సాజిత్‌ ప్రేమదాస మాట్లాడుతూ అధ్యక్షుడు విక్రమ్‌సింఘేను ప్రధానిగా నియమించేందుకు అంగీకరిస్తారని భావించడం పెద్ద ఆశ్చర్యం ఏమిలేదనిపేర్కొన్నారు. అంతకుముందు సిరిసేన యుఎన్‌పినేతను ఎట్టిపరిస్థితుల్లోను తిరిగి నియమించేదిలేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు పునర్నియామకం జరగడంతో అధ్యక్షుని అసలు వైఖరి బైటపడిందని అన్నారు. అధ్యక్షుణ్ణి కొన్ని శక్తులు తప్పుదారిపట్టించాయని, సమిష్టి ప్రభుత్వం నడవడం వారికి ఇష్టంలేదని, దీనివల్లనే విక్రమ్‌సింఘేను రాష్ట్రపతి తొలగించారని పేర్కొన్నారు. ఇపుడు నిజం ఏమిటన్నది తెలిసిందన్నారు. పార్టీ సిరిసేనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ సంఘటనతో పాఠాలు నేర్చుకున్నామని, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచి న్యాయం, సహేతుకత్వాన్ని ఇనుమడింపచేసే కృషిచేస్తామన్నారు. 73 ఏళ్ల రాజపక్ష 225 స్థానాలున్న పార్లమెంటులో మెజార్టీ నిరూపించుకోలేకపోయారు. దీనితో సిరిసేన పార్లమెంటును రద్దుచేసి జనవరి ఐదవ తేదీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే సుప్రీంకోర్టు సిరిసేన నిర్ణయాన్ని తిప్పికొట్టింది. ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయాన్ని నిలిపివేసింది. అంతేకాకుండా పార్లమెంటు రద్దు కూడా అప్రజాస్వామికమని,రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టంచేసింది. పూర్తిస్థాయి విచారణ కొనసాగేంతవరకూ రాజపక్షనే ప్రధానిగా నియమించాలన్న ఉత్తర్వులజారీకి రాజపక్ష దాఖలుచేసిన పిటిషన్‌పై స్టే ఉత్తర్వులు జారీచేసేందుకునిరాకరించింది. దీనితో రాజపక్ష రాజపక్ష రాజీనామా లేఖపై సంతకంచేసారు. అనేకమంది ప్రజాప్రతినిధులు, యుపిఎఫ్‌ఎ నేతలు, బౌద్ధులు, ఇతర మతపరమైన నాయకులు మొత్తం గుమికూడిన సందర్భంలోనే ఆయన రాజీనామాచేసారు. గత ఫిబ్రవరి 10వ తేదీనజరిగిన స్థానిక ఎన్నికల తర్వాత తన పార్టీ లక్ష్యం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావడమేనని అన్నారు. ఎన్నికలు లేకుండా తానుప్రధానిగా కొనసాగాలని భావించడంలేదని, అలాగే అధ్యక్షుని ఉత్తర్వులను ధిక్కరించలేనని అన్నారు. అందువల్లనే ప్రధానిపదవికి రాజీనామాచేస్తు అధ్యక్షుడు కొత్తప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు ఎంతోకాలం గడువులేదని, యుపిఎప్‌ఎ మరో గ్రీస్‌దేశం కాకుండా ఉండేందుకు చేపట్టిన కార్యాచరణను ఎన్నికలతోనే ఏర్పాటుచేయగలమని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కువదేశాలు రాజపక్ష ప్రభుత్వాన్ని గుర్తించకపోవడం కూడా ఒక కారణం. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు ఫిట్చ్‌, ఎస్‌అండ్‌పి, మూడీస్‌ వంటి అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు శ్రీలంక రేటింగ్‌ను తగ్గించాయి.
ఇదిలా ఉండగా శ్రీలంకలో సంక్షోభానికి తెరపడటాన్ని భారత్‌స్వాగతించింది. 51రోజుల సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంలో శ్రీలంక నేతలు అవిరళ కృషిచేసారని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. సంక్షోభాన్ని నివారించుకోవడంలో ఆదేశ రాజకీయ శక్తుల పరిణతిని స్పష్టంచేసిందని అన్నారు. ప్రధానిగా ప్రమాణస్వీకారంచేసిన రణిల్‌ విక్రమ్‌సింఘేకు విదేశాంగ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియజేసింది.