వీసా విధానంపై ట్రంప్ నిర్ణ‌యం పూర్తి ఆమోదయోగ్యం!

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: వీసా విధానంపై ట్రంప్ అధ్య‌క్ష‌త‌న అగ్రరాజ్యం అమెరికా సరికొత్త, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఇండో అమెరికన్‌ ట్రంప్‌కు మద్దతు పలికారు. ఆయన వలసలకు వ్యతిరేకం కాదంటూ శ్వేతసౌధం ప్రిన్సిపల్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ, ఇండో అమెరికన్‌ రాజ్‌షా అన్నారు. ‘ట్రంప్‌ది వలసల వ్యతిరేక విధానం కాదు. అక్రమ వలసల వ్యతిరేక విధానం. అమెరికాకు వలస వచ్చేవారు ప్రతిభావంతులై ఉండాలని ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే వీసా జారీలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇది పెద్ద తప్పు అని నేను అనుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ నిర్ణయం ఆమోదయోగ్యం. ప్రజలు దీనికి కచ్చితంగా మద్దతిస్తారు’ అని రాజ్‌షా అన్నారు. హెచ్‌-1బీ వీసా బిల్లుకు అమెరికా ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రాజ్‌ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హెచ్‌-1బీ వీసాదారుల కనీస వేతనాన్ని పెంచుతూ సిద్ధం చేసిన బిల్లుకు ఇటీవల అమెరికా కాంగ్రెస్‌ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో పాటు వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు చర్యలను కమిటీ ప్రతిపాదించింది. ఈ వీసాలకు భారత ఐటీ నిపుణుల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. అమెరికా ఉద్యోగుల స్థానాన్ని వీరితో భర్తీ చేయకుండా తాజా బిల్లులో ఆంక్షలతో కూడిన బిల్లును సిద్ధం చేసింది.