రైతు బీమాపై ప్రారంభమైన సర్వే

                           రైతు బీమాపై ప్రారంభమైన సర్వే

FARMER
FARMER

హైదరాబాద్‌: రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకానికి సంబంధించిన సర్వే బుధవారం నుండి ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు పొందిన, పెట్టుబడి చెక్కులు తీసుకున్న ప్రతీ రైతు ఇంటికి వెళ్లి నిర్ధేశించిన వయస్సు ఉన్న రైతులను గుర్తిస్తున్నారు. తర్వాత ఆ రైతులకు నామినీ పత్రాలను అందిస్తారు. నామినీ పేపర్లను నింపి రైతు సంతకం చేసిన తర్వాత వాటిని అధికారులు తిరిగి తీసుకుంటారు. నామినీ పత్రాలను అన్నింటినీ సేకరించిన తర్వాత వాటిని జీవిత బీమా సంస్థకు (ఎల్‌ఐసి) అప్పగిస్తారు. అగస్టు 15వ తేదీ నుండి రైతులకు ఎల్‌ఐసి కింద బీమా వర్తించనుంది. కాగా కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 42.94 లక్షల మందికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేసింది. అయితే కొందరు రైతులు ఇంకా వీటిని తీసుకోలేదు. మరి కొందరికి ఇంకా పట్టాదారు పాస్‌ పుస్తకాల ప్రింటింగ్‌ జరగ లేదు. ఈ క్రమంలో ప్రస్తుత లెక్కల ప్రకారం వ్యవసాయ శాఖ వర్గాలు 42.94 లక్షల మంది రైతుల దగ్గరికే వెళ్లి బీమా కోసం నామినీ వివరాలను తీసుకుంటారు. పట్టాదారు పాస్‌ పుస్తకం తీసుకోనివారు, ఇప్పటికీ అందని వారు ఎవరైనా ఉంటే వారిని బీమా పరిధిలోకి తీసుకొస్తామని వ్యవసాయ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎం జగన్మోహన్‌ వెల్లడించారు. అదనంగా వచ్చే రైతుల కోసం మూడు నెలలకు ఒకసారి ప్రీమియంను ప్రభుత్వమే ఎల్‌ఐసికి చెల్లిస్తుంది. ప్రీమియం సొమ్మును వ్యవసాయ శాఖ కమిషనర్‌ పేరుతో అగస్టు 1వ తేదీ లోపుగా ఎల్‌ఐసికి చెల్లిస్తారు. కాగా బీమా పరిధిలోకి రావాలంటే 18 నుండి 60 సంవత్సరాల వయస్సు లోపు ఉండాలాలి. ఆధార్‌కార్డులో ఉన్న పుట్టిన తేదీ ప్రకారం రైతుల వయస్సును పరిగణలోకి తీసుకుంటారు. ఒక వేళ పుట్టిన తేదీ లేకపోయినట్లయితే జూలై 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రతీ పట్టాదారుడి ఆధార్‌ నంబర్‌, పాస్‌ పుస్తకం నెంబరు, మొబైల్‌ నెంబరు, నామిని పేరు, నామిని ఆధార్‌, మొబైల్‌ నెంబరు తదితర వివరాలతో పాటు రైతు స్వయంగా సంతకం చేయాల్సి ఉంటుంది. 2018 అగస్టు 15వ తేదీ నుండి 2019 అగస్టు 14వ తేదీ వరకూ రైతులకు బీమా అమల్లో ఉంటుంది. ఏడాదికొకసారి ఈ బీమా పథకానికి ప్రీమియం చెల్లించి ప్రభుత్వమే పునరుద్ధరిస్తుంది. ప్రమాదవశాత్తూ రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా పరిహారం అందిస్తారు.