రూ.200ల‌కే గ్యాస్ క‌నెక్ష‌న్‌

Dharmendra pradan
Dharmendra pradan

ఢిల్లీ: కేరళ వరద బాధితులకు రూ.200కే ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌‌ను అందజేసేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అంగీకరించారు. వరదల కారణంగా కేరళలో కల్లోల పరిస్థితి ఏర్పడిన విషయం విదితం. ప్రజలు తమ ఇళ్లను, సామాగ్రిని కోల్పోయారు. ఇప్పుడిప్పుడే ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాల్లోని తమ ఇళ్లకు వెళ్తున్నారు. సహాయక శిబిరాల నుంచి తమ ఇళ్లకు వెళ్లిన బాధితులు బురదతో నిండిపోయిన సామాగ్రిని చూసి విలపిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి రూ.200కే ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ను ఇవ్వాలని, మిగతా వారికి రూ.1200కు ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రి కేజే.ఆల్ఫోన్స్‌ ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అందుకు అంగీకరించారు. సాధారణంగా ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ పొందేందుకు రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి రూ.200కే గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సిందిగా అన్ని ఆయిల్‌ కంపెనీలకు కేంద్రమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇది వెంటనే అమలు పరచాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. కేరళ వరదల కారణంగా దాదాపు 483 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారు.