మెరిట్ ఆధారంగానే గ్రీన్‌కార్డ్ జారీ

trump
trump

వాషింగ్టన్‌: అమెరికాలో స్థిరనివాసానికి అవకాశం కల్పించే గ్రీన్‌ కార్డు మంజూరులో లాటరీ విధానానికి స్వస్తి పలకనున్నారు. ఏటా 55 వేల మందికి లాటరీ ద్వారా గ్రీన్‌ కార్డులను జారీ చేస్తున్నారు. ఇకపై ప్రతిభ ఆధారంగానే గ్రీన్‌కార్డులను జారీ చేయనున్నారు. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకునే అవకాశం కల్పించే గ్రీన్‌ కార్డు జారీలో నిబంధనలను కఠినం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ నిర్ణయించారు. గ్రీన్‌కార్డు మంజూరులో లాటరీ విధానాన్ని తక్షణం రద్దు చేయాలని కాంగ్రెస్‌ను కోరనున్నట్లు ఆయన తెలిపారు. న్యూయార్క్‌లో ఉగ్రదాడికి పాల్పడిన ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సైఫుల్లా లాటరీ విధానం ద్వారా గ్రీన్‌కార్డును సంపాదించి అమెరికాలో స్థిరపడినట్లు తేలడంతో ట్రంప్‌ పైవిధంగా స్పందించారు. అతని ద్వారా అతని దూరపు బంధువులు మరో 23 మంది అమెరికాలోకి వచ్చిన విషయాన్ని సీరియ‌స్‌గా పరిగణిస్తున్నారు. లాటరీ విధానానికి స్వస్తి పలకాలని ఎప్పటి నుంచో తాను ప్రతిపాదిస్తున్నా డెమొక్రాట్లు అడ్డుకుంటున్నారని ట్రంప్‌ విమర్శించారు. కాగా, లాటరీ విధానంతోపాటు చైన్‌ మైగ్రేషన్‌ వ్యవస్థకూ స్వస్తి పలకాలనీ ప్రతిపాదిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన వలసదారులు వారి దూరపు బంధువులను అమెరికాకు తీసుకురావడాన్ని చైన్‌ మైగ్రేషన్‌ అంటారు. కాగా, ఉజ్బెకిస్థాన్‌ను ట్రావెల్‌ బ్యాన్‌ జాబితాలో చేర్చలేదని అమెరికా ప్రకటించింది.