మెట్రో ఆదరణ అధరహో….

METRO
METRO

నేడు గవర్నర్‌ చేతుల మీదుగా ఎల్‌బీనగర్‌-అమీర్‌పేట్‌ మెట్రో ప్రారంభం
ప్రజారవాణా వ్యవస్థలో తనదైన ముద్ర వేస్తున్న మెట్రో
ప్రజారవాణా వ్యవస్థలో అగ్రగామీగా నిలిచేందుకు కసరత్తులు
హైదరాబాద్‌: శరవేగంగా నిర్మితమవుతున్న మెట్రో రైలు భాగ్యనగరానికి మణిహారంగా తయారవుతోంది. నిర్మాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఒక్కో కారిడర్‌ను వేగవంతంగా పూర్తిచేస్తూ ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది. దీనిలో భాగంగా తొలివిడత గత పది నెలల క్రిందట మొదలైన మియాపూర్‌-నాగోల్‌ మార్గం ప్రారంభమై, అతి తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందుతుంది. అంతేగాక ప్రజారవాణా వ్యవస్థలో తమదైన శైలిలో సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తుంది. ప్రతి స్టేషన్లలో ప్రయాణ సౌకర్యాలతో పాటు వినోదాన్ని కూడా నగర ప్రజలకు అందుబాటులోకి తేవడంతో ప్రజలు సైతం మెట్రోలో ప్రయాణించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు సుమారు లక్ష మంది ప్రయాణికులు మెట్రోని ఆధరిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రాయాణం, ట్రాఫిక్‌ సమస్యల రహితం, సౌలభ్యంగా గమ్యస్థానాలకు చేరడం, కాలుష్య రహిత ప్రయాణం వంటి అంశాలను తీసుకొని అధికారులు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం రొడ్డు మార్గం గుండా ఎల్‌బినగర్‌ నుంచి మియాపూర్‌కి చేరాలంటే దాదాపు రెండు గంటల పైనే సమయం వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఈ రోజు అందుబాటులోకి రానున్న పూర్తిస్థాయిలో కారిడర్‌-1తో కేవలం 45 నిమిషాల్లోనే గమ్యస్థానంకి చేరుకోవచ్చని మెట్రోఅధికారులు పేర్కొంటున్నారు. వాస్తవంగా నిత్యం అత్యంత రద్దీగా ఉండే మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలో ప్రయాణించే వారు ఇక హాయిగా మెట్రోలో ప్రయాణాలు సాగించవచ్చు. ఎల్‌బినగర్‌ నుంచి మియాపూర్‌ వరకు మొత్తం 27 స్టేషన్లు ఉన్నాయి. రూ.14,132 కోట్లతో మెట్రోరైల్‌ ప్రాజెక్టును కొనసాగించడానికి రూపకల్పన చేశారు. అయితే వ్యవస్థ పొడవు 72 కి.మిలగా ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులో మియాపూర్‌ నుంచి ఎల్‌బినగర్‌, నాగోల్‌ నుంచి రాయదుర్గం, జెబిఎస్‌ నుంచి ఫలక్‌నామా వరకు మూడు కారిడర్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి ఐదు నుంచి పదినిమిషాలకు ఒక్కోరైలు నడుపుతూ ఒక్కో ట్రిప్పుకు 960 మంది ప్రయాణికులు ఏకకాలంలో ప్రయాణించేలా అధికారులు రూపకల్పన చేశారు.
ప్రజారవాణా వ్యవస్థలో అగ్రగామీగా నిలిచేందుకు కసరత్తులు;
సుఖవంతమైన ట్రాఫిక్‌ రహిత ప్రయాణం సాగించాలంటే మెట్రోమాత్రమే పరిష్కారమని మెట్రోఅధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రజలకు సైతం అధికారులు వివిధ పద్దతుల్లో అవగహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్‌ రహితయే కాకుండా సమయాన్ని కూడా ఆధా చేసుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు.ఎల్‌బినగర్‌ నుంచి మియాపూర్‌ రూట్‌లో 29 కిమిల దూరాన్ని 27 స్టేషన్ల మీదుగా 45 నిమిషాల సమయం, జెబిఎస్‌ నుంచి ఫలక్‌నామా 15 కి.మి దూరం, 16 స్టేషన్ల మీదుగా 22 నిమిషాలు సమయం, నాగోల్‌ నుంచి రాయదుర్గం 28 కి.మిల దూరంతో 23 స్టేషన్ల మీదుగా ప్రయాణాన్ని 30 నిమిషాల వ్యవధిలో నిర్ధేశిత సమయంలో మెట్రో చేరవేస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈరోజుతో ఎల్‌బినగర్‌-మియాపూర్‌ మార్గంకు మెట్రోపూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ రెండింటిని ఆసర చేసుకొని బాగ్యనగరంలో ప్రజారవాణా వ్యవస్థలో అగ్రగామీగా నిలిచేందుకు మెట్రో సిద్దమైంది. ఈరోజు నుంచి అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీనగర్‌, ఉస్మానియామెడికల్‌ కళాశాల, ఎంజిబిఎస్‌, విక్టోరియా మెమోరియల్‌, మలక్‌పేట్‌, న్యూమార్కెట్‌, ముసరంబాగ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపూరి, ఎల్‌బినగర్‌ వరకు మెట్రోపరుగులు పెట్టనుంది.