ముస్లిం మహిళకు వెలుగుబాట

TALAK
Triple Talak

ముస్లిం మహిళకు వెలుగుబాట

ముస్లిం మహిళలు అనాధికాలంగా అనుభవిస్తున్న వేదనకు విముక్తి లభించింది. తమ కన్నీటి ఆవేదనలకు స్వస్తిపలికే సమయం ఆసన్నమైంది. ఆనందం వెల్లివిరుస్తున్న వేళ, గుండెలో గూడుకట్టుకున్న బాధ క్రమంగా కనుమరుగైపోతున్న సమయం నిజంగా వారికి ఒక మరుపురాని మధురదినమే. అదే ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చే తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది.

ముమ్మారు ‘తలాక్‌ చెప్పి విడాకులిచ్చే పద్ధతి ఏ రకంగా చూసిన చెల్లబోదని విస్పష్టంగా చెప్పింది. సమానత్వ హక్కు కోసం పోరాడుతున్న అతివలకు కొండంత అండనిచ్చింది. ఈ సమస్యకు ప్రభుత్వం చట్టపరమైన పరిష్కారాన్ని చూపించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినా 3:2 ఆధిక్యంతో చరిత్రాత్మక తీర్పు వెలువడింది. చట్టాలతో పాటు ఖురాన్‌లోని అంశాలనూ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఉటంకించారు. అనేకమందిపై ప్రభావం చూపించే ఈ తీర్పును ప్రభుత్వం స్వాగతించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ లలిత్‌ మాట్లాడుతూ ముమ్మారు తలాక్‌తోపాటు ఖురాన్‌ చెప్పే మూలసూత్రాలకు విరుద్ధమైనవి ఏవైనా ఆమోదయోగ్యం కాదు. తలాక్‌ ఏకపక్షం అనేది విస్పష్టం. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. దీనిని రద్దు చేయాల్సిందే.

వివాహానికి పవిత్రతను, శాశ్వతత్వాన్ని ఖురాన్‌ ఆపాదిస్తుంది. అత్యంత అరుదైన సందర్భాల్లోనే తలాక్‌ను అనుమతించాలి. అప్పుడు రాజీకి ఒక ప్రయత్నం జరగాలి. అది ఫలిస్తే విడాకుల్ని వెనక్కి తీసుకోవాలి. తలాక్‌ కార్యరూపం దాల్చడానికి ముందు ఇవన్నీ తప్పనిసరిగా జరగాలని ఖురాన్‌ చెబుతోంది. ముమ్మారు తలాక్‌లో ఈ తలుపు మూసుకుపోతోంది, పవిత్ర ఖురాన్‌ చెబుతున్న ప్రాథమిక సూక్తులకు విరుద్ధంగా, షరియత్‌ను ఉల్లంఘించేదిగా ముమ్మారు తలాక్‌ ఉంది అంటూ జస్టిస్‌ నారీమన్‌, జస్టిస్‌ జోసెఫ్‌ పేర్కొన్నారు.

1400 సంవత్సరాలుగా ముస్లిం సమాజంలో కొనసాగుతూ వచ్చిన ఆచారానికి తెరదించింది. ముమ్మారు తలాక్‌తో విడాకులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై ధర్మాసనం తీర్పునిచ్చింది. వివిధ హైకోర్టులు దీనిపై ఇచ్చిన తీర్పులను ఉటంకించింది. ఈ విషయంలో షమీమ్‌ అరా కేసు ‘న్యాయపరమైన పూర్వత్వంగా నిలవబోదన్న అఖిలభారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ముమ్మారు తలాక్‌ అనేది మతపరమైన ఆచారమనీ, దానిని ఆరునెలల పాటు నిలుపు చేసి, ప్రభుత్వం ఒక చట్టం చేయడం మేలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌లు తమ తీర్పులో అభిప్రాయపడ్డారు.

సిస్టస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌లు మాత్రం దీనితో ఏకీభవించలేదు. ముమ్మారు తలాక్‌ పద్ధతి రాజ్యాంగ అతిక్రమణేనని వారు పేర్కొన్నారు. ‘ముమ్మారు తలాక్‌తో పాటు ఖురాన్‌ చెప్పే మూలసూత్రాలకు విరుద్ధమైనవి ఏవైనా ఆమోదయోగ్యం ఆకదు. తలాక్‌ ఏకపక్షం అనేది విస్పష్టం. ఇది రాజ్యాంగానికి విరుద్ధం దీనిని రద్దు చేయాల్సిందేనని ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ముమ్మారు తలాక్‌ ఇస్లాం మూలసూత్రాలకు లోబడి ఉందా లేదా అనే కీలక విషయంలో జస్టిస్‌ ఖేహర్‌, జస్టిస్‌ నజీర్‌లతో మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు. 3:2 ఆధిక్యంతో భిన్నాభిప్రాయాలు నమోదైన దృష్ట్యా ముమ్మారు తలాక్‌ను రద్దు చేస్తున్నాం అని సీజేఐ తీర్పునిచ్చారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ జోసెఫ్‌ తీర్పును రాస్తూ ముమ్మారు తలాక్‌ విధానం ముస్లింల పర్సనల్‌ లాలో అంతర్భాగంగా పరిగణించాలన్న సీజేఐ అభిప్రాయంతో తాను ఏకీభవించడం అత్యంత కష్టమని అన్నారు. ఆయన అభిప్రాయంతో జస్టిస్‌ నారీమన్‌, జస్టిస్‌ లలిత్‌లు ఏకీభవించారు. ఖురాన్‌లోని సూక్తుల్లో జస్టిస్‌ జోసెఫ్‌ ఉటంకిస్తూ తలాక్‌కు సంబంధించినంత వరకు అవి చాలా స్పష్టంగా, ఎలాంటి సందిగ్ధతకు తావ్ఞలేకుండా ఉన్నాయని చెప్పారు. ఈ అలవాటు సమానత్వం, హుందాతనాలకు విరుద్ధంగా ఉందన్న కేంద్రప్రభుత్వ వాదనను ఆయన సమర్ధించారు.

చట్టానికి మొదటి ఆధారం ఖురాన్‌ అనీ, దాన ఔన్నత్యాన్ని కాపాడాలనీ చెప్పారు. ఖురాన్‌లో స్పష్టంగా లేని విషయాల్లోనే హదిత్‌, ఇజ్మా ఖియాస్‌ వంటివాటిపై ఆధారపడాల్సి ఉంటుందన్నారు. అందువల్ల ఖురాన్‌లో ఉన్నవాటికి విరుద్ధంగా ఈ మూడింటిలో ఏదీ ఉండరాదన్నారు. ఖురాన్‌క వ్యతిరేకంగా ఇస్లాం ఉండజాలదు అని జస్టిస్‌ జోసెఫ్‌ చెప్పారు. తలాక్‌ పద్ధతి 14 శతాబ్దాలుగా అమల్లో ఉందన్న ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వాదనను ఆయన తోపిపుచ్చారు. ఒక అలవాటు దీర్ఘకాలం నుంచి కొనసాగుతూ వస్తున్నంతమాత్రాన అది ఎప్పటికీ చెల్లుబాటవ్ఞతుందని చెప్పలేమన్నారు. ఇలాంటి అభ్యాసానికి రాజ్యాంగపరమైన రక్షణ ఉండదన్నారు. ఆ విషయంలోనే తాను సీజేఐతో విభేదిస్తున్నానని వివరించారు.

ప్రాథమిక హక్కునైనా ఉపయోగించుకోకుండా ఆ అధికరణం కింద ఇంజంక్షన్‌ ఇవ్వడంపై తనకు తీవ్రసందేహాలున్నాయని చెప్పారు. ముమ్మారు తలాక్‌తో విడాకులు తీసుకోవడం రాజ్యాంగంలోని 14 అధికరణం ప్రసాదిస్తున్న సమానత్వం హక్కు ఉల్లంఘన కిందికే వస్తుందని జస్టిస్‌ నారీమన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన విడిగా తీర్పు రాశారు. తలాక్‌ కేవలం చట్టపరంగా అనుమతించే పద్ధతి మాత్రమేననీ, అదే సమయంలో దానిని పాపపు చర్యగా హనాఫీ స్కూలే చెబుతోందని గుర్తు చేశారు. ఈ పద్ధతి తక్షణ జరిగిపోయేది, వెనక్కి రాలేనిది. కుటుంబానికి చెందిన మధ్యవర్తుల ద్వారా భార్యాభర్తలు పశ్చాత్తాపం చెంది వెనక్కి రావడానికి ఆస్కారమే దీనిలో లేదు.

వివాహ బంధాన్ని కాపాడడానికి ఇలాంటి దానికి ఆస్కారం ఉండాలి. తలాక్‌ పద్ధతి ఖురాన్‌కు తగ్గట్టుగా కూడా లేదు. ఏకపక్షంగా, చపలచిత్తంతో వివాహబంధాన్ని విచ్ఛిన్నం చేసుకునేందుకు ఉపయోగపడుతోందనేది సుస్పష్టం అని అన్నారు. షరియత్‌ న్యాయం వక్రీకరణకు గురైంది. ముమ్మారు తలాక్‌ పద్ధతి ఇస్లాం మౌలికాంశాలకు దూరంగా ఉంది. ప్రాచీనకాలంలో అరేబియా ప్రాంతంలో ఆడశిశువ్ఞల్ని సజీవంగా పాతిపెట్టే ఆచారాన్ని తలపించే విధంగా ఈ అనాచారం కొనసాగుతోంది అఖిల భారత ముస్లిం మహిళా పర్సనల్‌ లా బోర్డు తరపున ఇస్లామిక్‌ మేధావి, కేంద్ర మాజీ మంత్రి ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ సర్వోన్నత న్యాయస్ధానంలో వినిపించిన వాదన అది.

దీని చరిత్ర ఇది:

ఒక హిందూ వారసత్వ వ్యాజ్య విచారణ సందర్భంగా విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు విచక్షణను ఎదుర్కొంటున్నారా అన్న అంశాన్ని పరిశీలించేందుకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2015 అక్టోబరులో భారత ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. ముమ్మారు తలాక్‌ ఉచ్చారణ, నిఖా హలాలా, బహుభార్యాత్వాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ఫిబ్రరిలో సుప్రీంకోర్టు నిర్ణయించింది. షరియా నిర్దేశిత పద్ధతుల్ని అడ్డగోలుగా ఉల్లంఘించి ‘వాట్స్‌అప్‌ లాంటి సావజిక మాధ్యమాల ద్వారానూ తలాక్‌ చెబుతున్న ధోరణులు పెరిగిపోతున్నాయి.

92శాతం ముస్లిం మహిళలు తలాక్‌ పద్ధతి పోవాలని కోరుతున్నట్లు ‘భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ అధ్యయనం వెల్లడించింది. బహుభార్యాత్యాన్ని నిషేధించిన ప్రతిచోటా అక్రమసంబంధాల జోరు పెరిగిందని, తలాక్‌ తరహాలో అనాయాసంగా భార్యను వదిలించుకొనే వీలులేకపోతే, హత్యలతో వాళ్లను తుదముట్టించే ప్రమాదం ఉందని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సుప్రీంకోర్టుకు ప్రమాణపత్రం సమర్పించింది.

అనాగరిక ఆలోచనా ధోరణికి పరాకాష్ఠ అది. ఉన్నపళంగా భర్త వదిలేసిన ముస్లిం మహిళల వేదన ఎంత దుర్భరమో న్యాయకోవిదుడు జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ 1971లో ఇచ్చిన తీర్పు కళ్లకు కడుతోంది. తర్వాత షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పునకు గండికొట్టేలా అప్పటి రాజీవ్‌ ప్రభుత్వం ముస్లిం మహిళల మనోవర్తి చట్టం తెచ్చింది. ఆ మేరకైనా తనకు జీవనభృతి దక్కించాలంటూ దాఖలైన షమిమ్‌ అరా కేసులో 2002 అక్టోబరులోనే న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అడ్డగోలు తలాక్‌ను రద్దు చేసి సంచలనం సృష్టించింది.

141 అధికరణ అనుసారం షమిమ్‌ అరా తీర్పునకే దేశంలో చట్ట ప్రామాణికత ఉందంటూ జస్టిస్‌ కురియన్‌ జోసెప్‌ చేసిన న్యాయనిర్ణయ నేడు బాధిత జనావళి కొండంత మేలు చేసినట్లుగా ఉంది.