మన్యంలో మావోల మకాం…!?

                             మన్యంలో మావోల మకాం…!?

maoists
maoists

– పోలవరం ముంపు మండలాలు సేఫ్‌జోన్‌
– జల్లెడ పడుతున్న బలగాలు
ఖమ్మం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హయాంలో ఖమ్మం జిల్లాలో భాగమైన పోలవరం ముంపు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు, వరరామచంద్రాపురం, కూనవరం, చింతూరు, నెల్లిపాక తదితర మండలాలను మావోయిస్టులు సేఫ్‌ జోన్‌గా ఏర్పరుచుకున్నట్లుగా కీలకమైన సమాచారం భద్రతా బలగాలను లభించింది. గోదావరి జిల్లాలల్లో విస్తరించిన మన్యంలో మావోయిస్టులు మకాం వేసినట్లుగా విశ్వసనీయంగా తెలియడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం భద్రాచలం మన్యంను ఆనుకుని వున్న ఈ ప్రాంతంలోకి మావోయిస్టులు గోదావరి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారన్న పక్కా సమాచారంతో మన్యంలోని అడవులను జల్లెడ పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఇటీవల ఎదురుదెబ్బలు, తీవ్ర కూంబింగ్‌ ఆపరేషన్లు నేపథ్యంలో ముంపు మండలాలు తమకు రక్షణ కవచంగా మావోయిస్టులు ఏర్పరుచుకున్నారని తెలుస్తోంది. గోదావరి మీదుగా రాకపోకలు సాగిస్తున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం చేరింది. దీనితో కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులతో సమన్వయం ఏర్పరుచుకుని సంయుక్తంగా అన్నల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. ఈనెలలో మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 45 మంది నక్సల్స్‌ చనిపోయిన సంగతి విదితమే. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్‌భూపాల్‌లపల్లి జిల్లా పోలీసు అధికారులతో కలిసి వెంకటాపురం మండలం చెలిమల గుట్టల్లో ఊసూరు అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో 10 మంది నక్సల్స్‌ను హతమార్చారు. తర్వాత జయశంకర్‌భూపాల్‌పల్లి జిల్లా పోలీసులతో పాటు ఛత్తీస్‌గడ్‌ బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో బీజాపూర్‌ జిల్లాలో మరో ముగ్గురు నక్సల్స్‌ చనిపోయారు. అటు ఏఓబీలోనూ ఆంధ్రా పోలీసులు ఉచ్చు బిగుస్తుండటంతో నక్సల్స సేఫ్‌జోన్‌గా ముంపు మండలాలను ఎంచుకున్నట్లుగా సమాచారం. ముంపు మండలాలకు గత కొన్ని సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఆదివాసీలు జీవిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు అటవీ ప్రాంతాల్లో సుమారు 30 గ్రామాలు ఉన్నాయి. వేలేరుపాడు మండలంలోనూ వీరి సంఖ్య ఎక్కువే. అటు తూర్పుగోదావరి జిల్లా కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు, నెల్లిపాక మండలాల్లోనూ వలస ఆదివాసీలు ఎక్కువే. గతంలో వీరు మావోయిస్టు పార్టీలో సానుభూతిపరులుగా, మరికొందరు సల్వాజుడుం బాధితులుగా ఉన్నారు. దీనితో వీరిపై భద్రతా బలగాలు దృష్టిసారించాయి. గత నాలుగు రోజులుగా ఆంధ్రలోని ఉభయ గోదావరి జిల్లాల పోలీసు అధికారులు కుక్కునూరు మండలం దామెరచర్ల అటవీప్రాంతంలోని ఆదివాసీల గ్రామాలను జల్లెడ పడుతున్నారు. సుమారు 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డీఎస్పీలతో పాటు స్థానిక సీఐలు, ఎస్సైలు ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. రేషన్‌, ఆధార్‌కార్డులను తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం గొమ్ముగూడెం(కుమారస్వామి గుట్ట) మీదుగా గోదావరి దాటి పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు అడవుల్లోకి మావోయిస్టులు భారీ సంఖ్యలో ప్రవేశించినట్లుగా సమాచారం వచ్చింది. గతంలోనూ ఇదే తరహాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నపుడు భద్రాచలం ప్రస్తుత నెల్లిపాక మండలం నందిగామ నుంచి కుక్కునూరు మండలం వింజరంనకు మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చారు. కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌ను పేల్చివేశారు. ఉప్పేరు సెల్‌టవర్‌తో పాటు బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. రహదారిపై లారీలను తగులబెట్టారు. వేలేరుపాడు మండలంలో పోలవరం నిర్వాసితులకు నిర్మించిన మోడల్‌ ఇళ్లను కూడా పేల్చివేశారు. కూనవరం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిని హతమార్చారు. వరరామచంద్రాపురం మండలంలో ఓ గిరిజనుడిని కూడా హత్య చేశారు. మళ్లీ అదే తరహాలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం నుంచి గోదావరి మీదుగా ప్రవేశించారన్న సమాచారం అధికారులను కలవరపెడుతోంది.

హెలీకాప్టర్‌ సంచారం

దండకారణ్యంలోని భద్రాచలం కేంద్రంగా భద్రతాబలగాలకు హెలీప్యాడ్‌ ఉంది. నాలుగు రోజులుగా భద్రాచలం సరిహద్దున ఆంధ్రలోని ముంపు మండలం కుక్కునూరులోని దామెరచర్లలో ఉభయ గోదావరి జిల్లాల పోలీసులు భారీ సంఖ్యలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం హెలీకాప్టర్‌ ద్వారా భద్రతాధికారి ఒకరు భద్రాచలం చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆదివాసీ గ్రామాల్లో పట్టుబడ్డ 10 మంది అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరి ద్వారా పూర్తి సమాచారం సేకరించేందుకు విచారణ చేస్తున్నట్లుగా వినికిడి. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో అనుమానితులను ఇంటరాగేషన్‌ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.