బార్‌కౌన్సిల్‌ ఎన్నికల్లో నేరచరితులకు నో ఎంట్రీ!

Madras High Court
Madras High Court

చెన్నై: బార్‌కౌన్సిల్‌ ఎన్నికల్లో నేరచరిత్ర కలిగినవారిని, రాజకీయ లింకులు ఉన్న వారిని ఎన్నికలకు అనుమతించకూడదని మద్రాసు హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు సూచించింది. అంతేకాకుండా పోటీచేసే అభ్యర్ధులు తమ ఆస్తిపాస్తుల వివరాలను తెలియజేయాలని, అభ్యర్ధులతోపాటు వారి కుటుంబసభ్యులకున్న ఆస్తులు వివరించాలని సూచించారు. అంతేకాకుండా వారివార్షిక ఆదాయ వనరులు కూడా వెల్లడించాలని, గడచిన పదేళ్లుగా న్యాయవాదులుగా వారి ఆదాయ వనరులు కూడా స్పష్టంచేయాలని హైకోర్టు సూచించింది. ఈ వివరాలుంటే బిసిఐ ఎన్నికల్లో ఓటువేసే వారికి పోటీదారుల చరిత్ర అర్ధం అవుతుందని జస్టిస్‌ ఎన్‌.కుబాకరన్‌ తన ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ వృత్తిలో నేరస్తులు ప్రవేశించకుండా ఉండేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. ఛార్జిషీట్లు దాఖలయిన క్రిమినల్‌ కేసుల్లో ఉన్న అభ్యర్ధులు, నేరాలకు మూడేళ్లకుపైబడి శిక్షలు పడినవారిని కూడా బిసిఐ ఎన్నికల్లో అనుమతించకూడదని హైకోర్టు స్పష్టంచేసింది. ఇలాంటి అభ్యర్ధులను అనుమతించకుండా ఉంటే వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులను స్వేఛ్ఛాయుత ఆటంకాలు లేనివిధంగా సత్వరమే విచారించేందుకు వీలవుతుందని అన్నారు. అలాగే ఏ ఒక్క రాజకీయ పార్టీలోను పోటీచేసే అభ్యర్ధికి లింకులు ఉండకూడదని, లేదా ఆయన ఏపదవిని కూడా నిర్వహించకుండా ఉండాలని అయితే ఎమ్మెల్యే, లేదా ఎంపిలు మాత్రం ఎన్నికల్లో పటీచేయవచ్చన్నారు. న్యాయవాదవృత్తిలో రాజకీయ జోక్యంనివారించేందుకు ఈ విధానం త్పోడుతుందన్నారు. అంతేకాకుండా పోటీచేస్తున్న అభ్యర్ధుల విద్యార్హతలు కూడా పరిశీలించాలని 2008 న్యాయవిద్యానిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అన్నది చూడాలన్నారు. రెగ్యులర్‌ విధానంలో లా డిగ్రీని పొందనిపక్షంలో,చట్టంలోని నిబంధనలను పూరించనిపక్షంలో వారి ప్రాథమిక అర్హతలు, అభ్యర్ధిత్వం కూడా తిరస్కరించబడాలని జస్టిస్‌ కృపాకరన్‌ వెల్లడించారు. సుప్రీంకోర్టునియమించిన జస్టిస్‌ అనిల్‌ ఆర్‌దవే కమిటీ ముందు ఈ సూచనలనుప్రస్తావించాలని బిసిఐకు జస్టిస్‌ కృపాకరన్‌ సూచించారు.