ప్రేమించడంలేదని కత్తితో దాడి

bharat, mounika
bharat, mounika

– బాలిక పరిస్థితి అందోళనకరం- డీసీపీ
తార్నాక: తనను ప్రేమించడం లేదని కక్ష పెంచుకున్న ఓ ప్రేమోన్నాది ఇంటర్‌ విద్యార్థినిపై విచక్షణా రహితంగా కత్తితో డాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాలికకు తీవ్రగాయాలై ప్రాణాపాయ స్థితిలో అసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంది. బస్తీవాసులు చూస్తుండగానే ధైర్యంగా ఆమెపై దాడికి తెగబడ్డాడు.. పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చినా బుద్ది మారని ప్రబుద్దుడు ఆమెను వెంబడించి కొబ్బరి బొండాలను కట్‌ చేసే కత్తితో దాడి చేశారు. దాడి చేసిన అనంతరం ఆమానవమృగం వారి ఇంటికి సమీపంలో ఉన్న మూసి కాలువ వద్ద దాచుకున్నాడు. నాలుగు బృందాలుగా గాలించిన పోలీసులు దాడికి పాల్పడిన నిందితుడిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఈస్ట్‌ జోనో డీసీపి ఎం. రమేష్‌, కాచిగూడ ఏసీపీ ఎస్‌.సుధాకర్‌ బుధవారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సీటీలోని ఏసీపీ కార్యాలయంలో ఘటన గురించి వివరాలను వెళ్లడించారు. బర్కత్‌పుర సత్యనగర్‌ ప్రాంతానికి చెందిన మంగ రాములు ఉదయం రెండో కుమార్తె మైనర్‌ బాలిక (మధులిక). నల్లకుంట శివం రోడ్డులోని శరత్‌ కాలేజీలో ఎంపిసీ గ్రూప్‌లో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతుంది. ఇదే ప్రాంతానికి చెందిన వేణుగోపాల్‌ కళ్యాణిల కుమారుడు చిట్టుకూరి భరత్‌అలియాస్‌ సోను (19) గత సంవత్సర కాలంగా అమ్మాయి వెంట పడుతూ ప్రేమించాలని వేదిస్తున్నాడు. భరత్‌ రాంకోఠిలోని జాగృతి డిగ్రి కాలేజ్‌లో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జనవరి 7న తేదిన బాదితురాలి తల్లి, తండ్రులు తమ కుమార్తెను భరత్‌ వేదిస్తున్నాడని షీటీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో షీటీమ్స్‌ భరత్‌ను, అతని కుటుంబ సభ్యులను,మైనర్‌ బాలికతో పాటు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. దీంతో అమ్మాయితో మాట్లాడనని అమెకు ఎలాంటి ఇబ్బంది పెట్టనని వారికి భరత్‌ చెప్పాడు. మరో సారి ఆమెను వేధించవద్దని వేదిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించి పంపించారు. ఇదిలా ఉండగా బుధవారం బాలిక మధులిక ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి కాలేజికి వెళుతుండగా పథకం ప్రకారం పకడ్పందిగా మాటు వేసిన భరత్‌ ఇంటి ప్రక్కనే ఉంటున్న బంధువుల ఇంటి వద్ద బాలిక కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అమె అక్కడికి వచ్చింది. ఆమెను అకస్మాత్తుగా పక్కకు లాక్కోని వెళ్లాడు. వెంటనే అతని వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాలను కట్‌ చేసే కత్తితో విచక్షణా రహితంగా మెడపైన, చేతులపైన, గదవపై మొత్తం 15 చోట్ల దాడి చేశాడు. దీంతో అరుపులు, కేకలతో బాలిక రక్తపు మడుగులో అక్కడే కుప్పకూలిపోయింది. దీంతో కొద్ది సేపటి అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించి మలక్‌పేట్‌లోని యశోద అసుపత్రికి తరలించారు. అమె పరిస్థితి క్రిటికల్‌ గానే ఉందని డీసీపి రమేషే పేర్కోన్నాడు. ధాడికి పాల్పడిన భరత్‌ అదే కత్తితో ఇంటికి వెళ్లి ఇంట్లో కత్తిని దాచిపెట్టి పారిపోయి ఇంటి పక్కనే ఉన్న మూసి కాలువ వద్ద ఉన్న నిర్మానుషప్రాంతంలో దాచుకున్నాడు. నాలుగు బృందాలతో పాటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొన్ని గంటల వ్యవదిలోనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనా స్థలానికి డిసీపీతో పాటు అడిషనల్‌ డీసీపీ గోవర్థన్‌రెడ్డి, ఏసీపి సుధాకర్‌, కాచిగూడ డిఐ. యాదేందర్‌ చేరకున్నారు. క్లూస్‌ టీం సందర్శించి వివరాలు సేకరించారు. కాగా మీడియా సమావేశంలో మలక్‌పేట్‌ ఏసీపి సుదర్శన్‌, సుల్తాన్‌బజార్‌ ఏసిపి డా. చేతన, ఉస్మానియా యూనివర్సీటీ ఇన్స్‌పెక్టర్‌ రాజశేకర్‌రెడ్డి, డిఐ రమేష్‌నాయక్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిపై సెక్షన్‌ 307,ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.