ప్రముఖ పండితుడు రఘునాథాచార్య మృతి

raghunathacharya
raghunathacharya

వరంగల్‌: ప్రముఖ సంస్కృత పండితుడు నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్య (93) కన్నుమూశారు. అనారోగ్యంతో వరంగల్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వరంగల్‌లో వేదపాఠశాలను నెలకొల్పి అనేక మంది శిష్యులకు ఆయన వేదం బోధించారు. జీయర్‌ స్వాములకు గురువుగా నిలిచిన రఘునాథాచార్య.. పలు గ్రంథ రచనలతో పాటు, పరిశోధనల్లో పేరు గడించారు. తన ఉపన్యాసాలతో సంస్కృత భాషా సేవ చేశారు. పలు ఆలయాల జీర్ణోద్ధరణకు పాటుపడ్డారు. రఘునాథాచార్య సేవలకు గుర్తింపుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక సత్కారాలు, బిరుదులు లభించాయి. 1970లో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి.. ఉభయ వేదాంత ఆచార్య, 1972లో రాష్ట్రపతి జాతీయ పురస్కారం, 1999లో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి నుంచి మహా మహోపాధ్యాయ బిరుదుతో పాటు అనేక సత్కారాలు అందుకున్నారు. 2008లో కాకతీయ విశ్వవిద్యాలయం రఘునాథాచార్యను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.