పెళ్లికళ కావాలంటే బాలా…!

పెళ్లికళ కావాలంటే బాలా…!

ప్రతి యువతికి పెళ్లినాడు అందంగా ఉండడమే జీవితాంతం గుర్తుకు వస్తుంది. అందువల్ల నాజూకుగా, అందంగా కనపడాలని ప్రతీ అమ్మాయి అనుకోవడం సహజం. ఇక అదే పెళ్లికయితే, మరింత మెరిసిపోవాలని, ఆ మధురానుభూతిని జీవితకాలం వెంట ఉంచుకోవాలనుకుంటుంది. జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లిరోజు ఎలా తయారుకావాలి? మేకప్‌ ఎలా చేసుకోవాలి? కాంబినేషన్స్‌ ఏం వాడాలి? కంగారుపడిపోతుంటారు. అలా చివరి సమయంలో ఆందోళన చెందకుండా ముందస్తు జాగ్రత్తలతో పెళ్లిరోజు అందంగా కాంతులీనాలంటే ఎలా ఉండాలో బ్యూటీషియన్‌లు చెబుతున్న కొన్ని సలహాలను చూద్దాం.

పెళ్లి ఉందనగా రెండు,మూడు వారాల ముందే మీ చర్మం, జుట్టు చేతిగోళ్లపై శ్రద్ధ పెట్టండి. రెండు, మూడు వారాలుగా వరుసగా ముందే ఫేషియల్‌, స్క్రబ్బింగ్‌ వంటివి చేయించుకోవాలి. దుమ్ము, ధూళి, ఎండకు వీలైనంత దూరంగా ఉండాలి. బీ అసలు ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఉండగలిగితే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలంటే ఎండవేడిమి తక్కువ సమయాల్లో వెళ్లడం మంచిది. ఉద్యోగాలకు వెళ్లే వాళ్లయితే వారానికోసారి బాడీమసాజ్‌ చేయించుకోండి. లేదంటే స్నానానికి ముందు ఆయిల్‌తో బాడీమసాజ్‌ చేసుకోవాలి.

పెళ్లికి ముందు రోజులు బాగా నిద్రపోండి. నిద్ర సరిగా లేకపోతే అలసిన మీ కనులు మీ ముఖాన్ని కాంతివిహీనంగా చేస్తాయి.
కళ్లకింద వలయాలు, నల్లటి చారలు ఏర్పడతాయి. పెళ్లికి మూడు రోజుల ముందే కనుబొమ్మలు ట్రిమ్‌ చేయించుకోవాలి. పెళ్లిరోజు మేకప్‌ మీ జువెలరీని బట్టి ఉంటుంది. నగలు మరీ ఎక్కువగా ఉంటే లైట్‌మేకప్‌ బాగుంటుంది.

పెళ్లి, రిసెప్షన్‌ రాత్రి సమయాల్లో ఉంటే హెవీ మేకప్‌ బాగుంటుంది. పెదాలకు వ్యాజిలైన్‌ అప్లయి చేసి మెత్తని టూత్‌బ్రష్‌తో రుద్దాలి. ముఖానికి ఫౌండేషన్‌ వేసేటప్పుడు అది పెదాలకు అంటకుండా జాగ్రత్తపడాలి. లిప్‌స్టిక్‌, ఐషాడో, మీ స్కిన్‌టోన్‌కు మీరు ధరించే డ్రెస్‌కు సెట్‌ అయ్యే విధంగా చూడాలి. ఐషాడో కోసం సహజమైన రంగులను వాడాలి. మెరిసే రంగులను వాడకపోవడం మంచిది.
========