పాక్‌తో క్రికెట్ ఆడే ప్ర‌శ‌క్తే లేదు : సుష్మా

sushma swaraj
sushma swaraj

న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్‌తో ఎట్టిపరిస్థితుల్లో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడే ప్రసక్తే లేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. తటస్థ వేదిక మీద కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరగవని ఆమె తెలిపారు. విదేశాంగశాఖకు చెందిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. పాకిస్థాన్ ఇటీవల పదేపదే కాల్పుల ఉల్లంఘన విరమణకు పాల్పడుతున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ దౌత్యం సరైంది కాదు అని ఆమె వెల్లడించారు. కానీ ఇరు దేశాల మధ్య ఖైదీల అప్పగింత జరుగుతుందని ఆమె తెలిపారు. ఇటీవల కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబంతో పాటు కాల్పుల విమరణ ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్‌తో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య క్రికెట్ మళ్లీ పునరుద్దరణ జరిగే అవకాశాలు లేవు. చివరిసారి డిసెంబర్ 2012లో పాక్‌తో భారత్ క్రికెట్ సిరీస్ ఆడింది. అప్పుడు భారత్‌లో పాక్ పర్యటించింది. ఈ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి సిరీస్ 2007లో జరిగింది. సరిహద్దు వద్ద హింస పెరుగుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక క్రికెట్‌కు ఆస్కారం లేదని మంత్రి స్పష్టం చేశారు. గ్లోబల్ టోర్నమెంట్లలోనూ పాక్, భారత్‌లను ఒకే గ్రూపులో పెట్టరాదు అని బీసీసీఐ గతంలో ఐసీసీని కోరిన విషయం తెలిసిందే.