పదవులు, టికెట్లు అమ్ముకునే వారా నోటీసులిచ్చేది?

K RAJA GOPAL REDDY
K RAJA GOPAL REDDY

సీఎం కావాలన్న తపనే కాని….పార్టీ బలోపేతంపై దృష్టి లేదు
నేను మాట్లాడింది కార్యకర్తల మనోభావాలే
మాలాంటి వారికి పదవులిచ్చి ప్రోత్సహించాలి
కాంగ్రెస్‌ అధిష్టానంపై విమర్శలను సమర్థించుకున్న రాజగోపాల్‌రెడ్డి
హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పదవులు, టికెట్లు అమ్ముకునే నేతలు తాను పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించానని నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసే నేతలను కాంగ్రెస్‌ పార్టీ విస్మరించిందని కార్యకర్తలు మనోవేదన చెందుతున్నారనీ, వారి అభిప్రాయాన్నే తాను చెప్పానని పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో కూర్చుని నోటీసులు ఇవ్వడం కాదు…కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఎందుకు అభివృద్ధి చెందడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాపై తనకెలాంటి వ్యతిరేకత లేదనీ, కాంగ్రెస్‌ తనలాంటి మంచి నేతలను దూరం చేసుకోవద్దని మాత్రమే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. గురువారం మునుగోడు నియోజకవర్గానికి చెందిన తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంపై చేసిన తీవ్రమైన విమర్శలపై శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అయితే పార్టీ షోకాజ్‌నోటీసుకు రాతపూర్తకంగా వివరణ ఇస్తాననికూడాఆయన వెల్లడించారు. రేవంత్‌ రెడ్డి పార్టీలోకి రావడాన్ని తాను వ్యతిరేకించడం లేదనీ, ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని తానే వ్యక్తిగతంగా ఒకటికి నాలుగుసార్లు కలసి ఆయనను పార్టీలోకి ఆహ్వానించానని తెలిపారు.
రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలనేదే తన తపన అని,అయితే కొంతమంది ఆయనను తప్పుతోవపట్టిస్తున్నారన్నారు. ఎన్నికలు వస్తుంటే పార్టీ కోసం కాకుండా సీఎం అభ్యర్థిగా నిలబడటానికి పోటీపడుతున్నారనీ, ఇది పార్టీలో నెలకొన్న వాతావరణానికి నిదర్శనమని పేర్కొన్నారు. తాను మాట్లాడింది ఎంత వరకు నిజమో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అంతర్మథం చేసుకోవాలనీ, తన అభిప్రాయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2014లో పార్టీ బలహీన అభ్యర్థులను పెట్టడం వల్లనే ఓడిపోయిందనీ, ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపామని చెప్పారు. నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి జెండా మోసే కార్యకర్తల కోసం అహర్నిశలు పాటుపడే తమ లాంటి వారిని ఇంట్లో కూర్చుండపెట్టేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో పోటీగా పనిచేసే వారు ఎవరో 31 జిల్లాలలో సర్వే చేసి గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఎవరు నాయకులుగా ఉంటే బాగుంటుందనే విషయంపై కూడా సర్వే చేయిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ను తిడితేనే పదవులు ఇస్తారా ? పార్టీలో నాయకులు లేరనే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారా అని ప్రశ్నించారు. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఇప్పటికే పార్టీ పక్షాన ఇవ్వాల్సిన హామీలన్నీ ఇచ్చివేశారనీ, అలాంటప్పుడు మేనిఫెస్టో కమిటీ ఏంటని ప్రశ్నించారు. ఏడెనిమిది మంది ఉండాల్సిన కమిటీలో 41 మందిని వేశారు, కాంగ్రెస్‌ అధికారంలోకివస్తే ఏమేమిఅమలుచేస్తామో ఇప్పటికే ఉత్తమ్‌ప్రకటించారని,ఇక ఈ కమిటీఎందుకని ఆయనప్రశ్నించారు.ఎలక్షన్‌ కమిటీలో, కో ఆర్డినేషన్‌ కమిటీలో అంత మంది ఎందుకని ప్రశ్నించారు. పార్టీలో ఒక గ్రూప్‌ తయారైందనీ, ఆ గ్రూప్‌ అనుకునే వారికే పదవులు వస్తున్నాయని ఆరోపించారు. పార్టీ అధిష్టానంపై బహిరంగ విమర్శలు చేయడం తప్పని తనకు తెలుసనీ, కానీ ఎన్నో సార్లు కుంతియాకు, పార్టీ సీనియర్‌ నేతలకు వాస్తవాలు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. నాకు సీఎం పదవి వద్దు, మినిస్టర్‌ పదవి వద్దు పార్టీకి రాజగోపాల్‌ అవసరం ఉందో లేదో మీరే తేల్చుకోండని నాయకులకు విజ్ఞప్తి చేశారు. బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వండి, మీ స్వార్థం చూసుకోకండని కోరారు. నాలాంటి వాడిని దూరం చేసుకుంటే పార్టీకే నష్టమనీ, తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చి సమాధానం ఇవ్వడానికి రెండు రోజుల గడువు విధించారనీ, నాకు రెండు రోజుల సమయం అవసరం లేదనుకుని రెండు గంటల్లోనే సమాధానం చెబుతున్నానని చెప్పారు. సురేష్‌ రెడ్డి పార్టీ మారినా కమిటీలలో ఆయన పేరుందనీ, పార్టీ నిద్దుర బోతున్నదనీ, లిస్ట్‌ మీడియాకు ఇచ్చే ముందు ఉత్తమ్‌ చూడలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనీ, తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉందనీ, ఈ సమయంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, పార్టీ సీనియర్‌ నేతలు కలసి కూర్చుని మరోసారి పార్టీకోసం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి ముగ్గురు నలుగురు చొప్పున కమిటీలో చాలనీ, 70 సంవత్సరాలు పైబడ్డ వారు కూడా ఇంకా ఎన్నో పోటీ చేయాలని చూస్తున్నారనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరే సీఎం కండి…కానీ పార్టీని బ్రతికించండని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గులాబీ కండువా కప్పుకున్న వారికి రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది కానీ, కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకున్న నేతలు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నన్ను చూసి ఓర్వలేని వ్యక్తులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, కుంతియాకు తనను వదులుకోవాలని లేదని తాను అనుకుంటున్నాననీ, తాను ఇండిపెండెంట్‌గా కాకుండా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేస్తాననీ, తనను ఇక్కడి నుంచి పోటీ చేయాలనే కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌ ఆరోపించినట్లుగా కాంగ్రెస్‌ పార్టీలో వంద శాతం కోవర్టులు ఉన్నారని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్సీగా గెలిచిన అనంతరం కార్యకర్తలకు కింది స్థాయి పదవులు కూడా ఇప్పించుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ శిక్షణ కమిటీ నోటీసులు
కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈమేరకు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ కోదండరెడ్డి అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమైన కమిటీ సభ్యులు రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయనీ, రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలనీ నోటీసులో పేర్కొన్నారు.