నేరెళ్ల ఘటన బాధాకరం: కెటిఆర్‌

KTR
TS Minister Ktr

నేరెళ్ల ఘటన బాధాకరం
ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: కెటిఆర్‌

వేములవాడ (రాజన్న సిరిసిల్ల జిల్లా),: రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులు పెంట బాణయ్య, కోల హరీశ్‌, చిట్యాల బాలరాజు, బత్లు మహేశ్‌, పసుల ఈశ్వర్‌కుమార్‌, గంధం గోపాల్‌లను రాష్ట్ర ఐటి, మున్సిపాల్‌ శాఖ మంత్రి కెటిఆర్‌, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌ బాబు, పుట్ట మధు, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌లతో కలిసి పరామర్శించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు నేరెళ్ల ఘటనను రాజకీయం చేస్తుయన్నారు. ఇసుక మాఫియా జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.. కాని ఇసుక మాఫియా జరిగితే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మూడేళ్లలో ఇసుక క్వారీలపై వెయ్యి కోట్లకు పైగా ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటుందని ప్రశ్నించారు. ఇసుక మాఫియా జరిగితే ప్రభుత్వానికి ఆదాయం రాదని ప్రతిపక్షాలు ఎరుగవా..? అని ప్రశ్నించారు.

ఏది ఏమైనా నేరెళ్ల ఘటన బాధకరమన్నారు. బాధితులను స్వయంగా పరామ ర్శించినపుడు తమను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని.. ప్రజలను కొట్టేఅధికారం పోలీసులకు ఎక్కడిదని.. ప్రశ్నించారన్నారు. చిత్రహింసలకు గురి చేసినఘటనపై డిఐజి స్ధాయిలో విచారణ జరుగుతోందని తుది నివేదిక తరువాత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతిపక్షాలు అనవసరపు రద్దాంతం చేయకుండా సద్విమర్శలు చేయాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రజల నుండి తనను ఎడం చేయడానికే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈకార్యక్రమంలో నగరపంచాయతీ చైర్‌ పర్సన్‌ నామాల ఉమ, టిఆర్‌ఎస్‌ నాయకులు ఎర్రం మహేశ్‌,నామాల లక్ష్మీరాజం, సెస్‌డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, చక్రపాణితో పాటు తదితరులున్నారు.