నేడు టిఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టో

TS CM KCR
TS CM KCR

హైద‌రాబాద్ః ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడమేకాకుండా.. ఇవ్వని హామీలను చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి.. తాజా ఎన్నికలకు ప్రకటించే మ్యానిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే పలు దఫాలు సమావేశమైన కమిటీ.. మంగళవారం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో సమావేశంకానున్నది. మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణభవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఎన్నికల ప్రణాళికకు తుదిమెరుగులు దిద్దుతారని భావిస్తున్నారు. అనంతరం పాక్షిక మ్యానిఫెస్టోను ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించనున్నారు. ఇప్పటివరకు ప్రజలనుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై ఈ సమావేశంలో చర్చిస్తామని టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ కే కేశవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమైన సమావేశమైనందున కమిటీ సభ్యులంతా సమావేశానికి తప్పక హాజరుకావాలని కోరారు. ఇప్పటికే అభ్యర్థులు ప్రజల్లో తిరుగుతూ ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నందున, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఇచ్చే హామీలను కూడా ప్రజల్లోకి వెంటనే తీసుకుపోవాలని నాయకత్వం యోచిస్తున్నది. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి మ్యానిఫెస్టో సిద్ధమయ్యేలోపు.. ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్న కొన్నింటిని వెల్లడించాలని కేసీఆర్ భావిస్తున్నారు.