నేడు కార్తీక పౌర్ణమి

Kaarteka poojalu
Kaarteka poojalu

This slideshow requires JavaScript.

నేడు కార్తీక పౌర్ణమి

దీపారాధనలో దివ్య మహిమ

కార్తికేతు కృతదీక్షా నృణాం జన్మవిమోచనీ కార్తీకమాసంలో ముఖ్యమైన పండుగలు రెండున్నాయి. ఒకటి క్షీరాబ్ధి ద్వాదశి కాగా రెండవది కార్తీక పౌర్ణమి. కార్తీకమాసంలో దీపాలు వెలిగించటం, దీపదానం చేయడం శ్రేష్ఠం. సాయంకాల వేళల్లో శివాలయం లేదా విష్ణువ్ఞ ఆలయంలో దీపాలు పెడితే పుణ్యం. మిగతా రోజుల్లో చేయకపోయినా, కార్తీకపౌర్ణమి నాడు తప్పక దీపాలు వెలిగించాలి. ఉసిరికాయల మీద వత్తులను పెట్టి దీపాలు పెడతారు. నదుల్లో దీపాలను వదలటంతో పాటు పండితులకు దీపదానం చేయటం మంచిది.

ఏవిధంగా చూసినా కార్తీకమాస ఆరాధనలు శివ,కేశవ్ఞలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. కార్తీకపౌర్ణమి నాడు కృత్తికా శివయోగం అనే పూజాపర్వాన్ని కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో శివాలయాల వద్ద జ్వాలాతోరణం నిర్వహించి శివారాధన చేసి పాడిపంటల్ని రక్షించమని కోరుకుంటారు. ఉదయం శ్రీహరిపూజ, సాయంత్రం సంధ్యవేళ శివారాధనం, దీపాలంకరణ, ఆకాశదీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. కార్తీకమాసంలో ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, ఆయాచితం, స్నానం, తిలదానం నిత్యవిధులుగా నిర్దేశించబడ్డాయి. కార్తీకపౌర్ణమినాడు గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంటవేసి పార్వతీదేవి విగ్రహాన్ని ముమ్మారు ఆ మంటకిందుగా తిప్పుతారు. దీనిని జ్వాలాతోరణం అంటారు. హాలాహలం సముద్ర మధన సమయంలో వచ్చినపుడు పార్వతీదేవి పరమశివ్ఞని ప్రార్థించి మింగవలసిందిగా ప్రార్థించిన సందర్భరీత్యా ప్రజారక్షణ చేసిన సంకేతంగా ఈ జ్వాలాతోరణం జరుపుతారు.

ఈరోజంతా ఉపవాసముండి సాయంత్రం శివాలయం వద్ద జ్వాలాతోరణం దర్శించుట వలన సర్వపాపాల ప్రక్షాళన జరుగుతుంది. కార్తీకమాసంలో ఏ మంత్రదీక్షను తీసుకున్నా గొప్ప ఫలితాన్నిస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కార్తీక ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5రోజులు -”భీష్మపంచకవ్రతం అంటారు. ఈ ఐదురోజులు శివమంత్రం గానీ, విష్ణుమంత్రం గానీ ఉపదేశం పొందడం, దీక్షగా జపించడం ఉత్కృష్ట ఫలప్రదాలు. ఈ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే శివాలయంలో 365 వత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరమంతా శివాలయంలో దీపం వెలిగించినంత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు.

ఈరోజున తమ స్థోమతకు తగ్గట్టు వెండి, రాగి, కంచు, మట్టి ప్రమిదలలో దీపాన్ని బ్రాహ్మణులకు దానం ఇస్తారు. ఈరోజు విష్ణువ్ఞకు కూడా ఇష్టమైనది కనుక అన్ని శివాలయాలలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాటి వెన్నెల ఆరోగ్యకరం కనుక కార్తీక పౌర్ణమినాడు వెన్నెల్లో పరమాన్నం వండుకుని పూజాదికాలు నిర్వర్తించి ప్రసాదాలు స్వీకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. తెల్లవారి నాలుగైదు గంటల మధ్య కృత్తికా నక్షత్రం కనిపిస్తుంది. కనుక ఆ సమయంలో నదీస్నానం పుణ్యప్రదమని, ఆరోగ్యదాయకమని పెద్దలు చెబుతారు. కార్తీకపౌర్ణమికో కథ ఉంది. కృతయుగంలో మాయా నగరంలో దేవశర్మ అనే వేదపండితుని కుమార్తె గుణవతి.

దేవశర్మ చంద్రుడు అనే యోగ్యుడైన వరుడికిచ్చి ఆమెకు వివాహం జరిపించాడు. ఒకనాడు మామా అల్లుళ్లిద్దరూ పళ్లు, పూలకోసం అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుడి చేత సంహరింపబడ్డారు. గుణవతి తండ్రికి, భర్తకి ఉత్తమగతులకోసం ఆచరించాల్సిన కర్మలన్నీ ఆచరించింది. దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో హరిభక్తినీ, జితేంద్రియత్వాన్ని పాటించేది. తన చిన్ననాటి నుండి అలవాటైన కార్తీక వ్రతం ఆచరించి కార్తీకమాసం నెలరోజులూ అరటిడొప్పలో దీపం ఉంచి నదిలే వదిలేది. తర్వాత గుడికి వెళ్లి దీపం వెలిగించేది. ఇంటివద్ద తులసికి ప్రదక్షిణం చేసేది. కార్తీక ఏకాదశినాడు ఉపవాసం చేసేది. పౌర్ణమినాడు దీపదానాలు చేసేది. ఈ వ్రత పుణ్యఫలంగా ఆమె విష్ణుసాన్నిధ్యం పొందింది. గుణవతి సత్యభామగా పుట్టి శ్రీకృష్ణునికి ప్రియసఖి అయింది. కార్తీక మాసంలో ఏదీక్షను అనుసరించినా మోక్షదాయకం.

పున్నమి వెలుగుల పుణ్యమాసమైన కార్తీకమాసంలో భక్తులంతా ఎదురుచూసే పరమ పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసి ఉన్న రోజునే కార్తీకపౌర్ణమి అంటారు. కార్తీకపౌర్ణమి ఎంతో విశిష్టత కలిగినది. ఈ పౌర్ణమి శివ,పార్వతులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. సాధారణంగా కార్తీకమాసం నెలరోజులు పూజలు, వ్రతాలు చేయలేనివారు ఒక సోమవారమైనా, కార్తీకపౌర్ణమి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేస్తే ఎంతో పుణ్యమొస్తుందని శాస్త్రం చెబుతోంది. ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గ్రామాల్లో ప్రతిఒక్కరూ కఠోర ఉపవాసదీక్షలతో కార్తీకపౌర్ణమి వ్రతం (కేదారేశ్వరనోము )చేయడం ఆనవాయితీగా వస్తుంది. పౌర్ణమిరోజు సూర్యోదయానికి ముందే చెరువులు, నదులు అవి అందుబాటులో లేకపోతే బావులు,

ఇంటివద్దయినా శీతలస్నానం చేసి కార్తీకపౌర్ణమి వ్రతాన్ని ప్రారంభించాలి. మహిళలు అరటిడొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదలాలి. భక్తిపూర్వకంగా పవిత్రమనస్సుతో ఇలా చేయడం వలన వారికి మనస్సులో వున్న కోరికలు సిద్ధిస్తాయి. వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను నదిలో వదిలితే ఎంతో ఫలం లభిస్తుంది. పౌర్ణమినాడు బ్రహ్మి సమయంలోనే తులసిని పూజించాలి. ఆవునేతితో తడిపిన దారపు వత్తుల దీపాలు వెలిగించి, తులసికోట చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి పాయసం (పరమాన్నం) నైవేద్యంగా పెట్టి, 365 వత్తుల కట్టతో దీపారాధన చేయాలి. పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్లి శివునికి బిల్వపత్రాలు, భస్మలేపనం, అవిసెపూలతో పూజచేయడం వలన కైలాసప్రాప్తి లభిస్తుంది. శివాలయాల్లో మహాన్యాసక రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమౌతాడని శాస్త్రవచనం

. పౌర్ణమిరోజు శివాలయాలు, విష్ణాలయాల్లో దీపారాధన చేస్తే ఎంతో మేలు చేకూరుతుంది. ఆరిపోయిన జ్యోతిని వెలిగించినా పుణ్యం కలుగుతుంది. అదే విధంగా దీపదానం చేయడం వలన శివసాన్నిధ్యం కలుగుతుంది. దీపదానం చేయలేనివారు సర్వజ్ఞాన ప్రదం సర్వ సంపత్పుఖావనం దీపదానం ప్రదాస్మావి శాంతిరసుసదామమ! అనే మంత్రాన్ని పఠించాలి. వీలైతే శ్రీలలితాదేవిని సహస్ర నామాలతో పూజించాలి. దీనివల్ల ఆ దేవి సకల ఐశ్వర్యాలను కల్గిస్తుంది. పౌర్ణమిరోజు రాత్రి 12గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను ఇంటిలో వున్న వారంతా తాగితే ఏడాది పొడవునా ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం భక్తుల్లో విశేషంగా వుంది. కేదారేశ్వరుని వ్రతం !: కార్తీకపౌర్ణమి రోజు మహిళలంతా నోచుకునే నోముకు సంబంధించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో వుంది.

పౌర్ణమి రోజంతా కఠోర ఉపవాసముండి సాయంత్రం వేళగౌరీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు సంబంధించి గ్రామాల్లో పెద్దలు ఎంతో వినసొంపుగా వుండే కేదారేశ్వర నోముకు సంబంధించిన కథను కుటుంబ సభ్యులకు విన్పిస్తుంటారు. కార్తీకపౌర్ణమి వ్రతం (కేదారేశ్వరుని నోము) చేసుకోలేని భక్తులు ఈ కథ చెప్పే ఇంటికి వెళ్లి భక్తితో కథ వినడం ఎంతో మంచిది. పట్టణాల్లోను, మరికొన్ని ప్రాంతాల్లోను కేదారేశ్వర వ్రతం పేరుతో ప్రచురితమైన పుస్తకాల్లో వున్న కధను చెబుతున్నారు. అది చదివినా, విన్నా ఎంతో పుణ్యం సిద్ధిస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి (శివపార్వతులకు)మర్రిచెట్టు ఊడలను తోరణాలుగాను, మర్రిపండ్లను బూరెలు గాను, మర్రి ఆకులును విస్తర్లుగాను పెట్టి పూజలు చేయాలి.

గ్రామీణ ప్రాంతాల్లో పురాతన కాలం నుంచి భక్తులు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడం వారిలో భక్తిభావాన్ని చాటుతుంది. చాలామంది ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుంటారు. సాయంత్రం వేళ శివాలయాలకు వెళ్లి జ్యోతులు వెలిగించి పూజలు నిర్వహించిన పిమ్మట ఇళ్లవద్ద నోములు (వ్రతం) నోచుకోవాలి. ఎవరైతే కార్తీకపౌర్ణమి రోజు కేదారేశ్వరుని నోము నోచుకుంటారో వారికి ఏడాదిపాటు అన్న వస్త్రాదులు, సిరిసంపదలకు లోటుండదని పురాణాల ద్వారా తెలుస్తుంది. పవిత్ర మనస్సుతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరకు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, తమలపాకులు, పువ్వులతో పూజచేసి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం (హారతి) ఇవ్వాలి. అనంతరం రాత్రికి నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి.