నూరేళ్ల బంధానికి కౌన్సెలింగ్‌తో పునాది

TRADITIONAL WEDDING
TRADITIONAL WEDDING

This slideshow requires JavaScript.

నూరేళ్ల బంధానికి కౌన్సెలింగ్‌తో పునాది

తెలియని ప్రదేశానికి వెళ్లే ముందు మనం ఆ ప్రదేశం గురించి ఒకటికి పదిసార్లు అడిగి తెలుసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురైనా సమర్థంగా ఎదుర్కోవచ్చన్నది మన ముందుచూపు. మరి జీవితాంతం కలిసి చేయాల్సిన ప్రయాణంలో ఒడిదుడుకులను తట్టుకోవాలంటే ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా! కాస్త ఆప్యాయత, కాస్త అర్థం చేసుకునే తత్వం, కొద్దిగా సర్దుకుపోయే గుణం ఉంటే పెళ్లి అనే బంధానికి మరింత దృఢత్వం చేకూరుతుంది. వీటితో పాటు ఈమధ్యకాలంలో మ్యారేజ్‌ కౌన్సెలింగ్‌ కూడా ఎక్కువైంది. రెండు వేర్వేరు ఆలోచనలు, సంప్రదాయాలు కలిగిన వ్యక్తులు కలిసి జీవించబోయే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను వివరించేందుకు ఈ కౌన్సెలింగ్‌ ఉపయోగపడుతోంది.
పల్లవిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పెళ్లైన వారంరోజుల్లోనే ఆమె భర్తను వదిలేసి పుట్టింటికి పరుగెత్తుకుని వచ్చింది. ఇక భర్తతో కాపురం చేయనని, అత్తింటికి వెళ్లనని మొండికేసింది. తల్లిదండ్రులు, పెద్దలు ఎంత అడిగినా, సమాధానం చెప్పలేదు. చివరికి స్నేహితుల సాయంతో ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇస్తే, ఆ కుటుంబం ఆనందంగా సాగిపోతున్నది.

పావనిది మరొక సమస్య. భర్త ఓ శాడిస్టు అని విడాకులకు ప్రయత్నించింది. అయితే సన్నిహితులు వారిద్దరిని సైకాలజిస్టుల వద్దకు తీసుకెళ్లి, కౌన్సెలింగ్‌ ఇప్పించారు. పావన భర్తకు చాదస్తం మాట వాస్తమేకాని, అది మరీ శాడిస్టు టైప్‌ అయితే కాదు. కొన్నిరకాల మందులు, ట్రీట్‌మెంట్‌ ద్వారా అతడి సమస్య పరిష్కారం అయ్యింది. పల్లవి, పావని ఇద్దరికీ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చిన మాట వాస్తవమే. విడాకుల వరకు దారితీసినా, చివరికి కౌన్సెలింగ్‌తో వారి సమస్య పరిష్కారం అయ్యింది.

సంప్రదాయ భారతీయ సమాజంలో పెళ్లికి ముందే యువతీ, యువకులు కౌన్సెలింగ్‌ కోసం ధైర్యంగా డాక్టరు దగ్గరికి వెళ్లగలిగే పరిస్థితి లేదు. దీన్నొక అవమానకర విషయంగా భావించేవారి సంఖ్యే ఎక్కువ. ఢిల్లీకి చెందిన ఒక మ్యారేజ్‌ కౌన్సెలర్‌ దీని గురించి ఇలా వివరించారు. కౌన్సెలింగ్‌లో రెండు ముఖ్య విషయాలుంటాయి. హెల్త్‌ కౌన్సెలింగ్‌, రిలేషన్‌ కౌన్సెలింగ్‌. ఆరోగ్య సంబంధ విషయాలు తెలుసుకోవ డం ద్వారా కొన్ని సమస్యల నుండి బయటపడవచ్చు.

రిలేషన్‌ కౌన్సెలింగ్‌ వల్ల కొత్త వాతావరణంలో అడుగుపెట్టిన అమ్మాయి పరిస్థితులకు తగ్గట్టు ఎలా నడుచుకోవాలో అర్థం చేసుకుంటుంది. హెల్త్‌ కౌన్సెలింగ్‌ కౌన్సెలింగ్‌ కోసం వచ్చిన పెళ్లి చేసుకోబోయే అబ్బాయి, అమ్మాయికి హెల్త్‌ కౌన్సెలింగ్‌లలో చెప్పే మొదటి విషయం ఇద్దరిని ఆర్‌హెచ్‌ ఫ్యాక్టర్‌ పరీక్ష చేయించుకోమనడం. ఈ పరీక్ష వల్ల ఇద్దరి బ్లడ్‌గ్రూప్‌లు మ్యాచ్‌ అయ్యాయా లేదా అన్న విషయం అర్థం అవ్ఞతుంది. రక్తం మ్యాచ్‌ అవ్వని సందర్భాల్లో పుట్టబోయే పిల్లలకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ.

కనుక ఈ టెస్ట్‌ను తప్పనిసరిగా చేయించుకోమని సలహా ఇస్తారు మ్యారేజ్‌ కౌన్సెలర్‌లు. హెచ్‌.ఐ.వి, బి.పి, డయాబెటిస్‌ దీనితో పాటు చేయించుకోవాల్సిన మరికొన్ని ముఖ్య పరీక్షలు. ఈ పరీక్షల వల్ల తెలిసిన వాస్తవాలను ఆధారంగా చేసుకుని ఇద్దరూ ఇష్టమో కాదో నిర్ణయించు కోగలుగుతారు. పెళ్లి తరువాత ఏదైనా విషయం తెలియడం వల్ల ఎదురయ్యే సమస్యల కన్నా ఇది ఉత్తమం.

ఈ విషయంలో ఇద్దరూ ఒక అభిప్రాయానికి రాగలగాలి. వివాహం తరువాత సంసార జీవనంలో ఏదైన సమస్య అనిపిస్తే భార్యాభర్తలిద్దరూ కలిసి చర్చించుకోవడం వల్ల సమస్యలు చాలా వరకూ తీరిపోతాయంటారు కౌన్సెలర్లు. ఒకరినొకరు ఏ విషయాన్ని పంచుకోకుండా భయంతోనో, మరేదైనా కారణంగానో మౌనంగా ఉండిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆలోచనాపరంగా సంసిద్ధులమని తెలిసినప్పుడే వివాహానికి ముందుకు రావాలని వారు సలహా ఇస్తున్నారు.

ఎందుకంటే అమ్మాయి గర్భం ధరించినప్పుడు పై కారణాలన్నీ ఆమె బిడ్డపై ప్రభావం చూపిస్తాయి. కనుక అన్ని విధాలుగా సంతృప్తి అనిపించిన తరువాతే పెళ్లికి సిద్ధపడాలి. రిలేషన్‌ కౌన్సెలింగ్‌ ఇందులో మొదటిది ఒకరినొకరు అర్థం చేసుకోవడం, రెండోది మిగిలిన సంబంధీకులను తెలుసుకోగలగడం. ఒకరికొకరు సాధారణంగా పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు తమలోని మంచి గుణాలను మాత్రమే బహిర్గతం చేసుకుంటారు. పెళ్లి జరిగిన తరువాత లోటుపాట్లు కనిపించినప్పుడు ఒకరినొకరు దూషించుకోవడం మొదలౌతుంది.

ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ముందుగానే తమ గుణగణాలను, ఇష్టాఅయిష్టాలను ఎదుటివారికి విప్పి చెప్పడం వల్ల వారిని అర్థం చేసుకోవడం తేలికౌతుంది. కుటుంబంతో మెలగడం రెండు భిన్న కుటుంబాలు, వేరువేరు సాంప్రదాయాల్లో పెరిగిన వారు ఒక్కటైనప్పుడు ఎదుటి వారి జీవన విధానాలను అవగతం చేసుకోవాలి. తల్లిగారింట్లో గారాబంగా, ఏ పనీ తెలియకుండా పెరిగిన అమ్మాయికి అత్తవారింట్లో ఎక్కువ బంధుగణం ఊపిరి సలపని పని ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని తట్టుకోవడం కాస్త ఇబ్బందికరమే.

అలాంటప్పుడు భర్త, అత్తగారు, తల్లిదండ్రుల సహకారంతో సమస్యను అధిగమించే ప్రయత్నం చేయాలి. అబ్బాయి అత్తగారింటి సాంప్రదాయాలను గౌరవించాలనే స్పృహను కలిగి ఉండాలి. ఒకరికోసం ఒకరు జీవించడం మంచిదే. దానితో పాటే తమకోసం కొంత జీవితాన్ని కేటాయించుకోవడం అవసరం. కుటుంబం, బాధ్యతలు, సంపాదనతోనే భర్త సమయాన్ని గడిపేయక్కర్లేదు. ఇంటిపనులు, భర్త ఇష్టాఇష్టాలే తనవిగా మార్చేసుకుని స్వంత ఇష్టాలను భార్య విడనాడవసరం లేదు. ఇద్దరికీ నచ్చినవి నిర్వహిస్తూనే ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించుకునేలా ఉండాలి.