నాంపల్లి ఎగ్జిషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Nampally Exhibition Ground Fire Accident
Nampally Exhibition Ground Fire Accident

హైదరాబాద్‌: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలోని నుమాయిష్‌లో నెల రోజులుగా సందడి జరుగుతుంది. అయితే అక్కడ గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తొలుత ఒక స్టాల్లో చిన్నగా మొదలైన మంటలు ఇతర దుకాణాలకూ క్షణాల్లో పాకాయి. అధిక శాతం స్టాళన్నీ ప్లాస్టిక్‌, కర్రలు, తదితర వస్తువులతో రూపొందించడం దుకాణాల్లో దుస్తులు, ప్లాస్టిక్‌ వస్తువులు వంటివి అధికంగా ఉండడంతో రెప్పపాటులో మంటలు అగ్నికీలలుగా మారాయి. దుకాణాలు పక్కపక్కనే ఆనుకుని ఉండటం కూడా మంటలు త్వరత్వరగా విస్తరించటానికి కారణమయ్యింది. అగ్నిమాపక శకటాలు వచ్చేలోపే సుమారు వంద దుకాణాలకు నిప్పంటుకుంది. కొన్ని అప్పటికే పూర్తిగా ఆహుతయ్యాయి. ప్రాథమిక సమాచారం మేరకు రాత్రి 8.30గంటల సమయంలో పారిశ్రామిక ప్రదర్శనలోని మహేశ్‌ బ్యాంక్‌ స్టాల్‌లో విద్యుదాఘాతం సంభవించి మంటలు రేగాయి. వాటిని ఆర్పేసే లోపే ఆంధ్రాబ్యాంక్‌ స్టాల్‌కు వ్యాపించాయి. ఆంధ్రాబ్యాంక్‌ సహాయ మేనేజర్‌ మూర్తి మంటలు ఆర్పేందుకు యత్నించారు. పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్‌ చేశారు. మధ్య మండలం డీసీపీ విశ్వ ప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌, పోలీస్‌ సిబ్బంది సహాయంతో ఎగ్జిబిషన్‌లో ఉన్న వారిని బయటకు రప్పించారు. ప్రమాదం జరిగినప్పుడు నుమాయిష్‌లో సుమారు 40వేల మంది సందర్శకులున్నారని పోలీసుల అంచనా. అంతేకాక ఒకవైపు మంటలు వ్యాపించకుండా అడ్డుకుంటూనే సందర్శకులను సురక్షితంగా బయటకు పంపించటానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ విపత్తు నివారణ బృందం తీవ్రంగా శ్రమించారు. రాత్రి 11.30 గంటల సమయంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మరోవైపు నుమాయిష్‌ నుంచి బయటకు వచ్చిన వారు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసీ 84 ప్రత్యేక బస్సులు నడిపింది. మెట్రోరైల్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చని మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ తదితరులు వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు. దిల్లీలో ఉన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.అంజనీ కుమార్‌ అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు. స్వల్ప తొక్కిసలాట మినహా ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో రాజ్‌కుమార్‌(45), దిల్వార్‌ హుస్సేన్‌(50) కొంత అస్వస్థతకు గురయ్యారని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.