ధర్నాచౌక్‌పై మధ్యంతర ఉత్తర్వులు

High Court
High Court

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానాల నుంచి తాజాగా మరో గట్టి దెబ్బతగిలింది. నగరంలోని ఇందిరాపార్క్‌ వద్దగల ధర్నాచౌక్‌ ఎత్తివేత నిర్ణయాన్ని రద్దు చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆరు వారాల పాటు ఈ తీర్పు అమల్లో ఉంటుందని మంగళవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. నగరం మధ్యలో ధర్నాచౌక్‌ ఉండటంతో తమకు ఇబ్బంది కలుగుతోందని, పిల్లలను పాఠశాలలకు పంపలేకపోతున్నామని పలువురు స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారని రాష్ట్ర పోలీసులు అక్కడ ఎలాంటి ఆందోళనలు జరగకుండా నిషేధం విధించారు. ఈ ప్రాంతంలో ఆందోళనలపై పోలీసులు నిషేధాన్ని విధించడంతో తమప్రజాస్వామ్య హక్కును ప్రభుత్వం కాలరాసిందని పలు ప్రజా సంఘాలు, పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తూ ధర్నాచౌక్‌ను యధావిధిగా కొనసాగించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు ధర్నా చౌక్‌ సమీపంలో ఉండటం సమంసజమనే వాదనలు జరిగాయి. ఆందోళన కారులు ఎక్కడ ధర్నా చేసినప్పటికీ మీడియా ద్వారా పాలనా యంత్రాంగానికి తెలుస్తుందని, ప్రజలకు విషయాలు తెలుస్తాయని కూడా ప్రభుత్వం గతంలోవాదించింది. రాజధాని నగరంలో ఆందోళన కారులు రాకపోకల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం ఈ ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ప్రశ్నించే ప్రజల హక్కును హైకోర్టు ఈ తీర్పుతో అంగీకరించినట్లయింది. ఈ తీర్పుతో ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆరువారాలు పరిశీలించిన తర్వాత ఈ అంశంపై పూర్తి స్థాయిలోస్పందిస్తామని కూడా కోర్టు తెలిపింది. తీర్పుతో ఇకపై ధర్నాచౌక్‌లో నిరసనలు తెలపడానికి అందరికీ అవకాశం లభించింది.
హైకోర్టు తీర్పు కేసిఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు-దత్తాత్రేయ
ధర్నాచౌక్‌పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామి కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు కేసిఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఆయన వెల్లడించారు. ధర్నాచౌక్‌ విషయంలో కేసిఆర్‌ వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆరోపించారు. ప్రజాకోర్టులో తెలంగాణ ప్రజలు కేసిఆర్‌కు బుద్ది చెప్పాలని దత్త్తాత్రేయ పిలుపునిచ్చారు.
పునరుద్ధరణ ప్రజా విజయం: పరిరక్షణ కమిటీ కన్వీనర్‌
ధర్నాచౌక్‌లో నిరసన ప్రదర్శనలు, బహిరంగ సభలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య విజయమని ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో దాదాపు 18 నెలలుగా జరిగిన శాంతియుత పోరాటం హైకోర్టు ఉత్తర్వులతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా, గడీల పాలనకు ఘోరీ కట్టడానికి ఈ తీర్పు పునాది రాయి కాగలదన్నారు. ఈ సందర్భంగా రిట్‌ పిటీషన్‌ వేసిన విశ్వేశ్వరావును అభినందించారు. విశ్వేశ్వరావును అభినందించిన వారిలో ఇంకా సిపిఐ ఎంఎల్‌ న్యూడెమాక్రసీ నాయకులు గోవర్ధన్‌, ఆర్‌ఎస్‌పి జాతీయ నాయకులు జానకిరాం, ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సుధాకర్‌, సిపిఐ రాష్ట్ర ఇన్‌ ఛార్జి కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తదితరులు అభినందించారు.